యాదాద్రి భువనగిరి, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నది. ప్రభుత్వం, నేతలను ప్రశ్నించినా.. తప్పిదాలకు ఎదురు నిలబడినా దౌర్జన్యాలకు తెగబడుతున్నది. నేరుగా దాడులకు దిగుతూ ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలే ఇందుకు తార్కాణం. వారం రోజుల్లోనే మూడు చోట్ల వేర్వేరుగా ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.
బీబీనగర్ మండలంలోని గూడూరులో సోమవారం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ హాజరయ్యారు. రైతుబంధు రాలేదన్నోళ్లను చెప్పుతో కొట్టాలని మంత్రి అనడం సబబుకాదని సందీప్ రెడ్డి సున్నితంగా ఆయన దృష్టికి తెచ్చే ప్రయత్నం తెచ్చారు. అలా అన్నారో లేదో అప్పుడే కాంగ్రెస్ కార్యకర్తలు సందీప్ రెడ్డి ప్రసంగానికి అడ్డుతగిలారు. జోక్యం చేసుకున్న మంత్రి.. ‘కనీసం వార్డు మెంబర్ గెలిచే స్థాయిలో కూడా లేనోడివి నన్ను విమర్శిస్తావా’ అంటూ అడ్డగోలుగా వ్యాఖ్యానించారు.
దీనికి సందీప్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి తగ్గకపోగా.. మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల అరాచకం మొదలైంది. ఏకంగా స్టేజీపైకి వచ్చి అడ్డగోలుగా వ్యవహరించారు. సందీప్ రెడ్డి డౌన్‌డౌన్, గోబ్యాక్ అంటూ స్లోగన్లు ఇచ్చారు. సందీప్ రెడ్డిపైకి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతోపాటు తీవ్ర తోపులాట జరిగింది. ఓ కార్యకర్త ఏకంగా సందీప్‌రెడ్డిని వెనకాల నుంచి భుజంపై కొట్టి.. ముందుకు నెట్టివేశారు. బీఆర్ఎస్ నేతలు సందీప్ రెడ్డిని పక్కకు తీసుకెళ్లారు. మరోవైపు ఈ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sandeep Reddy
సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్ గండూరి పావనీకృపాకర్పై ఆదివారం దాడి జరిగింది. ఏకంగా కాంగ్రెస్ కౌన్సిలర్లే అటాక్ చేశారు. వారికి బీజేపీ, బీఎస్పీ సభ్యులు వత్తాసు పలికారు. ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరి భయానక వాతావరణాన్ని సృష్టించారు. దాంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయా పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత వై.వెంకటేశ్వర్లు, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణతోపాటు పలువురికి గాయాలయ్యాయి.
యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో ఈ నెల 22న యువజన సంఘం కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సుమారు వంద పోలీసులతో జేసీబీతో నేలమట్టం చేశారు. మల్లాపురం సర్పంచ్ తన సొంత నిధులు రూ.25లక్షలతో నిర్మించారు. ఇది నక్షబాటలో ఉందంటూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఒత్తిడితో నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చేశారు. ప్రశాంతంగా ఉన్న మల్లాపురంలో భయానక వాతావరణం సృష్టించారు.
బీఆర్ఎస్ పాలనలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండేది. ప్రజాప్రతినిధుల మధ్య రాజకీయ విమర్శలకే పరిమితం అయ్యేది. వ్యక్తిగత దూషణలు, దాడులు, దౌర్జన్యాలు ఉండేవి కాదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడువక ముందే అరాచకాలు చేస్తున్నది. ప్రశాంతం ఉన్న పల్లెలను ఘర్షణల వైపు మళ్లిస్తున్నది. ప్రతిపక్ష నేతలపై పార్టీ శ్రేణులను రెచ్చగొడుతూ దాడులకు ఉసిగొల్పుతున్నది.