నీలగిరి, అక్టోబర్ 11 : కోటీశ్వరుల పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలను నిర్మిస్తున్నదని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని గంథంవారిగూడెం వద్ద రూ.300కోట్లతో వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పైలాన్ ఆవిష్కరించి, నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఇంగ్లిష్, తెలుగు మీడియంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదువుతోపాటు అన్ని వసతులు, ప్లే గ్రౌండ్స్ ఉంటాయని చెప్పారు. నల్లగొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న పాఠశాల నిర్మాణాన్ని 8 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.
జిల్లాలో ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా రెండు పంటలకు సాగునీరు అందించేందుకుగాను ఎస్ఎల్బీసీ టన్నెల్ మిషన్ విడి భాగాలను అమెరికా నుంచి తెప్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ ద్వారా శ్రీశైలం నీరు డెడ్ స్టోరేజీలో ఉన్నా నల్లగొండ జిల్లాకు సాగునీరు అందుతుందన్నారు. కృష్ణా నీటిలో జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుల కాళ్లు కడిగినప్పుడే తన కల నెరవేరుతందన్నారు.
బ్రాహ్మణ వెల్లెంల ద్వారా సాగునీరు ఇచ్చేందుకు ఇటీవల 25 వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు. నల్లగొండ మెడికల్ కళాశాల పనులు పూర్తయ్యాయని, నవంబర్‌లో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, డీఈ గణేశ్, జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు.