నల్లగొండ సిటీ, జూన్ 16 : ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కనగల్ మండలంలోని దర్వేశిపురంలో రేణుకా ఎల్లమ్మ బ్రహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి దంపతులు హాజరై అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కల్యాణాన్ని తిలకించారు. ఉదయం 5గంటలకు మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవ, లలితా సహస్రనామార్చన, బాలభోగ నివేదన, గవ్యాంత పూజలు, దేవీ మూలమంత్ర హోమం, లఘు పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పములను నిర్వహించారు.
సాయంత్రం దేవీ మూలమంత్ర హోమం, దుర్గాహోమం, గవ్యాంత పూజలు, బలిహరణం, నీరాజన మంత్ర పుష్పములు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. సోమవారం 108 కలశాలతో అష్టోతర శతఘటాభిషేకం, సాయంత్రం దర్వేశిపురం, పర్వతగిరి నుంచి బోనాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ఈఓ జల్లేపల్లి జయరామయ్య తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మహేంద్రకుమార్, డీఎస్పీ శివరాంరెడ్డి, తాసీల్దార్ జ్యోతి, మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, అలయ కమిటీ మాజీ చైర్మన్లు కరుణాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, చెన్నగోని యాదగిరి, నల్లబోతు యాదగిరి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.