సూర్యాపేట, ఫిబ్రవరి 27 : అభివృద్ధికి టెక్నాలజీ జత చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని, ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ ఆఫీస్ విధానాన్ని సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ఈ ఆఫీస్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని, దానితో సమయం ఆదా అవుతుందని అన్నారు. తొలుత రెవెన్యూ శాఖలో ప్రారంభమైన సేవలు అన్ని కార్యాలయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ ఆఫీస్‌తో అధికారుల నుంచి సామాన్య ప్రజలు సైతం ఆన్లైన్లో ఫైల్ వివరాలను చూసుకోవచ్చని చెప్పారు.
అభివృద్ధికి టెక్నాలజీ జత కలిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ ఆఫీస్‌ను సమావేశ మందిరంలో ప్రారంభించి మాట్లాడారు. ఈ ఆఫీస్ విధానంతో సమయం ఆదాతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ఈ ఆఫీస్ విధానం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తొలుత రెవెన్యూ శాఖలో ప్రారంభమైన సేవలు అన్ని కార్యాలయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ ఆఫీస్ విధానంతో అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు. ఆయా శాఖల్లో ఫైల్ మిస్సింగ్ గాకుండా ఉంటుందన్నారు. ఫైల్స్ స్టేటస్‌ను జిల్లా, రాష్ట్ర అధికారులే గాకుండా సామన్య ప్రజలు సైతం ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఒక ఫైల్ ఆఫీసర్‌కు చేరిన డేట్, టైం వివరాలన్నీ ఆన్లైన్లో కనిపిస్తాయని తెలిపారు. ఈ ఆఫీస్ సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఉద్యోగులు ఈ సేవలు ఉపయోగించి మంచి పేరు తేవాలని కోరారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్.మోహన్‌రావు, జడ్పీ సీఈఓ సురేశ్, డీఆర్ఓ రాజేంద్రప్రసాద్, డీఆర్డీఓ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
రేపటిలోగా యువతికి న్యాయం జరగాలి
ఈ ఆఫీస్ ప్రారంభానికి వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కొన్ని దరఖాస్తులను స్వీకరించి వాటికి పరిష్కారాలను చూపించారు. మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామానికి చెందిన బుడిగ మమత తన ఇంటి వెనుకాల బాత్రూంలు కట్టకుండా అడ్డుకుంటున్నారని దరఖాస్తు అందించింది. వెంటనే స్పందించిన మంత్రి వెబ్‌కాస్ట్ ద్వారా నేరుగా మఠంపల్లి ఎంపీడీఓ, తాసీల్దార్‌తో మాట్లాడారు. రేపటి లోగా సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
సుబ్బారావు సమస్య పరిష్కరించాలి
మునగాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బారావు తన పేరు మీద ఉన్న తొమ్మిదెకరాల భూమి సర్వే నంబర్లు 964-3, 919-2-3 ఆన్లైన్లో బ్లాక్ లిస్టులో ఉందని తెలిపారు. మండల కార్యాలయం చుట్టూ ఎన్ని నెలలు తిరిగినా సమస్య పరిష్కారం కావట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే కోదాడ ఆర్డీఓ, మునగాల తాసీల్దార్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.