సూర్యాపేట, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షపాతి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తెలంగాణ పెట్టింది పేరు అని అభివర్ణించారు. తొమ్మిదేండ్లుగా ముందెన్నడూ లేని రీతిలో మహిళల సంక్షేమానికి, రక్షణకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. షీ టీమ్స్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్లు ఇందుకు తార్కాణాలు అని ఉదహరించారు. విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కొనియాడారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ నారీ లోకానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో మహిళను నిలబెట్టి గెలిపించుకున్న రికార్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థలతో పాటు నామినేటెడ్ పోస్టుల్లోనూ 50శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళలను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న ప్రభత్వమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో చట్టసభలతో పాటు నామినేటెడ్ పదవుల్లో ఉన్న మహిళల సంఖ్య 67,486 (50.07 శాతం) ఉన్నదని వెల్లడించారు. అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించి వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మహిళాలోకం బాసటగా నిలబడిందని, భవిష్యత్‌లోనూ అలాగే ఉంటుందని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు.