సూర్యాపేట టౌన్, జనవరి 14 : జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో శనివారం గోదాదేవి కల్యాణం వేద పండితుల మంత్రోచ్ఛరణలతో అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తన సతీమణి సునీత, కుమారుడు వేమన్రెడ్డితో కలిసి హాజరై ఆద్యంతం తిలకించి కల్యాణం జరిపించారు. క్యాంపు కార్యాలయం నుంచి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలతో దేవాలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేలాదిగా పాల్గొన్న భక్తుల నడుమ వేద పండితులు సంప్రదాయ పద్ధతిలో గోదాదేవి, రంగనాథుల కల్యాణం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు, ఒడి బియ్యం వేడుక వైభవోపేతంగా జరిపించారు.
అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి, సునీత దంపతులు పూలమాలతో నృత్యాలు, పూలబంతితో ఆటలు సంప్రదాయ పద్ధతిలో సందడిగా సాగాయి. భక్తి గీతాలకు మహిళల నృత్యాలు, చిన్నారి నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. మంత్రి కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని మతాల పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి పాలకుల హయాంలో ఆదరణకు నోచుకోని దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చామన్నారు. ధూప, దీప, నైవేధ్య పథకంతో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించామని తెలిపారు. యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని కోట్లాది రూపాయలతో ఎవరూ ఊహించని రీతిలో తీర్చిదిద్దుకున్నామని చెప్పారు. భగవంతుడి ఆశీర్వాదంతో త్వరలో సూర్యాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు చేసుకుందామన్నారు.