ఉచితంగా కోచింగ్ ఇప్పించేందుకు కసరత్తు
ప్రతి నియోజకవర్గంలో సెంటర్ల ఏర్పాటుకు సన్నాహకాలు
ఉత్తమ ఫ్యాకల్టీ, వసతుల కల్పనపై సమాలోచనలు
ఇప్పటికే పలుచోట్ల కొనసాగుతున్న సెంటర్లు
ఎస్ ఫౌండేషన్ నిర్వహణకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఏర్పాట్లు
గతంలోనూ తోడ్పాటునందించిన ఎమ్మెల్యేలు
భారీగా ఉద్యోగాల ప్రకటన నేపథ్యంలో ప్రత్యేక దృష్టి
పేద, మధ్య తరగతి యువతకు ఆసరా
అసెంబ్లీ సమావేశాలు ముగిశాక పూర్తిస్థాయి కార్యాచరణ
నల్లగొండ ప్రతినిధి, మార్చి12(నమస్తే తెలంగాణ) : సమైక్య పాలకుల విధానాల వల్ల ఉద్యోగాల కల్పనలో ఏర్పడ్డ అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ స్వరాష్ట్రంలో కొత్త జోనల్ విధానంలో భారీగా కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఒకేసారి 80,039 ఖాళీలకు వరుస నోటిఫికేషన్లు వేయనున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో ఉద్యోగార్థుల్లో నూతనోత్సాహం నెలకొంది. మునుపెన్నడూ లేనన్ని అవకాశాలు ముందుండడంతో అన్ని స్థాయిల్లోని ఉద్యోగాల కోసం శిక్షణపై యువత దృష్టి పెడుతున్నది. కాగా, పోటీ పరీక్షల సన్నద్ధతలో వారికి అండగా నిలిచేందుకు ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉచిత శిక్షణ ఇప్పించడంతోపాటు ఇతర వసతుల కల్పనకు సన్నాహకాలు చేస్తున్నారు. ఉత్తమ ఫ్యాకల్టీ, భవనాలు, ఉచితంగా స్టడీ మెటీరియల్, వీలైతే భోజనాలు.. ఇలా స్థానిక పరిస్థితులను బట్టి సాధ్యాసాధ్యాలపై సమాలోచనలు చేస్తున్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గతం నుంచే ఉచిత కోచింగ్ సెంటర్లు కొనసాగుతున్నాయి. పోలీస్, ఇతర పోటీ పరీక్షల సమయంలో వాటిల్లో శిక్షణ పొందిన ఉద్యోగాలు సాధించిన వారూ ఉన్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టడంతో అందుకు అనుగుణంగా యువతకు అండగా నిలిచేందుకు ఎమ్మెల్యేలు ముందుకు వస్తుండడం విశేషం. దీనిపై నిరుద్యోగులు, ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన యువత హర్షం వ్యక్తం చేస్తున్నది.
ఉద్యోగాల కల్పనపై సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి ఈ విషయంపైనే కేంద్రీకృతమైంది. ఆయా విభాగాల వారీగా ఖాళీల సంఖ్యను ప్రకటించడంతో అభ్యర్థులు అందుకు అనుగుణంగా పరీక్షలకు సిద్ధమయ్యే పనిలో ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 1,398, సూర్యాపేటలో 719, యాదాద్రిలో 1,010 జిల్లా స్థాయి పోస్టులతో పాటు యాదాద్రి జోన్ పరిధిలో 2,160 జోనల్ పోస్టులు, చార్మినార్ మల్టీజోన్ పరిధిలో 6,370 పోస్టుల కోసం త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పోస్టులతో పాటు ఇతర జిల్లా, జోన్, మల్టీజోన్లలోనూ 5శాతం పోస్టుల కోసం పోటీ పడే అవకాశం కూడా ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు ఉంది. ఇదే సమయంలో పదేళ్ల గరిష్ఠ వయోపరిమితి కూడా పెంచడంతో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల ప్రకటన చేయడంతో నిరుద్యోగులు సొంత ప్రిపరేషన్‌తో పాటు మంచి కోచింగ్‌పైనా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లో కోచింగ్ సెంటర్లల్లో అభ్యర్థుల సందడి నెలకొంది. సబ్జెక్టుల వారీగా నిపుణులు ఎక్కడ ఉన్నారు? ఆయా కోచింగ్ సెంటర్లలోని ఫ్యాకల్టీ వివరాలు, ఫీజు వంటి అంశాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. అయితే కోచింగ్ కేంద్రాల్లో ఫీజులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉండాలంటే వసతి, హాస్టల్ అద్దె, భోజనం ఖర్చు ఇలా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇలాంటి వారి కోసం సీఎం కేసీఆర్, యువనేత కేటీఆర్ సూచనలతో ఎమ్మెల్యేలు నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల యువతకు ఉచిత శిక్షణతో పాటు ఇతర వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. ఉచిత మెటీరియల్, వీలైతే భోజనాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులకు అనుగుణంగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక ఎమ్మెల్యేలు ఉచిత శిక్షణను ప్రారంభించాలని భావిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో…
మిర్యాలగూడ నియోజకవర్గంలో కొంతకాలంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు నేతృత్వంలోని ‘ఎన్బీఆర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కుమారుడు నల్లమోతు సిద్ధార్థ ఫౌండేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. గతంలోనూ పోలీసు, విద్యాసంస్థల నోటిఫికేషన్ల సమయంలోనూ కోచింగ్‌ను కొనసాగించారు. ఇప్పుడు కూడా పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐల శిక్షణ కొనసాగుతున్నది. ప్రస్తుతం భారీగా ఉద్యోగాల ప్రకటన నేపథ్యంలో దాని ద్వారా మరింత విస్తృతంగా కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సుమారు రెండు వేల మందికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న భవిత కోచింగ్ సెంటర్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించి అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కూడా ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించారు. అందుకు కావాల్సిన ఫ్యాకల్టీ, వసతి వంటి వాటిపై పార్టీ వర్గాల ద్వారా ఆరా తీసే పనిలో ఉన్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామీణ నేపథ్యం కలిగిన నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోనూ ఉచిత శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్‌కుమార్ దృష్టి సారించినట్లు తెలిసింది. మొత్తంగా తమ నియోజకవర్గాల పరిధిలోని యువతకు ఉద్యోగాల సాధనలో అండగా నిలువాలన్న సంకల్పంతో ఎమ్మెల్యేలు అడుగులు వేస్తున్నారు.
గతం నుంచే పలుచోట్ల
గతంలోనూ పోలీసు, ఇతర ఉద్యోగాల ప్రకటన సమయంలో ఉమ్మడి జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు ఉచిత శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తాజా ప్రకటనతో మళ్లీ పూర్తిస్థాయిలో వీటిని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో గతంలో యువత కోసం పలు శిక్షణా కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తన తల్లి పేరుతో ‘గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తన సతీమణి సునీత సారథ్యంలో నిర్వహిస్తున్నారు. ఉచిత స్టడీ మెటీరియల్, భోజన వసతి వంటివి ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా సూర్యాపేటలో పోటీపరీక్షలకు సిద్ధమయ్యే యువతకు అండగా నిలిచేందుకు ప్రత్యేక శిక్షణపై కసరత్తు చేస్తున్నారు. అతిత్వరలోనే దీనిపై ప్రకటన చేసి ప్రారంభించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకురాలు గుంటకండ్ల సునీత తెలిపారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి తన తండ్రి పేరుతో ‘అంకిరెడ్డి ఫౌండేషన్” ఏర్పాటు చేసి ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూడా ఉచిత శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు క్యాంపు కార్యాలయంలో యువత నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. త్వరలోనే కోచింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కోదాడలోనూ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ‘మల్లన్న యువసేన’ పేరుతో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానించారు. అభ్యర్థులు కోదాడలోని క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. తుంగతుర్తి లాంటి గ్రామీణ నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతం కావడంతో ఫ్యాకల్టీ, వసతి, ఇతర సౌకర్యాలపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
యువతలో ఉత్సాహం
ప్రభుత్వం వేలాది ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తుండగా… వాటి సాధనకు సిద్ధమయ్యే అభ్యర్థులకు భరోసానిస్తూ ప్రజాప్రతినిధులు ముందుకు వస్తుండడంతో యువతలో సంతోషం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి యువతకు ఉచిత శిక్షణ ఎంతగానో తోడ్పాటునందించనుంది. సీఎం కేసీఆర్, యువనేత కేటీఆర్ మార్గదర్శనంలో ప్రజాప్రతినిధులు ఉద్యోగాల సాధనలో యువతకు తోడ్పాటునందించేందుకు ముందుకు వస్తుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.