సమాజ శ్రేయస్సు, సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేదే సాహిత్యం అని, ఆ దిశగా రాష్ట్ర అద్భుత ప్రగతిని వివరించేలా కవులు, సాహితీవేత్తలు తమ రచనలతో ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పదేండ్లలోనే అన్ని రంగాలను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి సాధించడంతోపాటు కళలు, కవులకు, కళాకారులకు పుట్టినిల్లుగా తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన సాహిత్య దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. సాహితీవేత్తలు, కవులు, రచయితలు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారన్నారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతి ఔన్నత్యాన్ని పెంచేలా సాహితీవేత్తలు కృషి చేయాలని కోరారు. ఎందరో మహనీయుల కళలు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాకారం అవుతున్నాయని, అందుకే యావత్ ప్రజానీకం తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ అని కొనియాడుతున్నారని పేర్కొన్నారు. నిరంతర అభివృద్ధి పాలన, వినూత్న పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కవులు, సాహితీవేత్తలను ఘనంగా సన్మానించారు. సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు కవితలు, రచనా ప్రసంగాలతో కార్యక్రమాలు పండుగలా సాగాయి.
– సూర్యాపేట టౌన్/రామగిరి, జూన్ 11
సూర్యాపేట టౌన్/రామగిరి, జూన్ 11 : 60 ఏండ్లకు పైగా అన్ని విధాలుగా ఆగమైన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా సాధించి కేవలం 9 ఏండ్లలోనే అన్ని రంగాలను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేయడంతోపాటు కళలు, కవులు, కళాకారులకు పుట్టినిల్లుగా తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా కవులు, కళాకారుల ఆత్మ గౌరవాన్ని పెంపోందించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరం, సూర్యాపేటలోని పాత మిర్చి యార్డులో జరిగిన సాహితీ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాహిత్యానికి రంజింప జేసే లక్షణంతోపాటు జ్వలింప జేసే లక్షణం కూడా ఉందన్నారు.
సాహిత్యం నాడు తెలంగాణ ఉద్యం వైపే నిలబడిందని.. కవులు, కళాకారుల ఆటపాటలు ఉద్యమానికి ఉత్తేజాన్ని నింపాయన్నారు. ఆకలి లేని సమాజం కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. నేడు ప్రజలు, అధికారులు కలిసి సంబురాలు జరుకోవడం విశేషమన్నారు. గత ఉమ్మడి పాలకుల హయాంలో ఏమాత్రం అభివృధ్ధి నోచని తెలంగాణ ప్రాంతాన్ని దశాబ్ది కాలంలోనే ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధితో తీర్చిదిద్ది సంచలనాత్మక పథకాలతో వినూత్న రీతిలో అందిస్తున్న పాలన నేడు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎందరో మహనీయుల కళలు నేడు తెలంగాణలో సాకారం అవుతున్నాయన్నారు. ఉమ్మడి నిర్లక్ష్య పాలనలో 60 ఏండ్లు అన్ని విధాలుగా ఆగమైన తెలంగాణను కేవలం పదేండ్లలోనే ఊహించని రీతిలో అభివృద్ధి పాలనతో తెలంగాణ రూపురేఖలు మార్చారన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌తోపాటు ప్రజలందరికీ నిరంతరం విద్యుత్, కృష్ణా, గోదావరి జలాలతో నిరంతరం తాగు, సాగు నీరందిస్తున్న సీఎం కేసీఆర్‌దే అని కొని
యాడారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతి, అభివృద్ధి, ఔన్నత్యాన్ని పెంచేలా సాహితీవేత్తలు, కవులు, రచయితలు తమ రచనలు వెలువర్చారని గుర్తుచేశారు. సమాజ హితం, శ్రేయస్సు, సమాకాలీన పరిస్థితులకు సాహిత్యం అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం నాటి అవసరం మేరకు సాహితీవేత్తలు, కవులు సాహిత్యాన్ని మన ముందు ఉంచారని తెలిపారు. అదే సాహిత్యం ప్రజలను చైతన్యవంతులను చేసి బయటికి వచ్చి ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతో ఉవ్వెత్తు స్థాయికి సాహిత్యం వెల్లిందన్నారు. సాహితీవేత్తలు, కవులు, రచయితల పాటలు, కవితలు, రచనలు ఉద్యమంలో కీలక భూమిక పోషించాయన్నారు. బోయ జంగయ్య, సుద్దాల హనుమంతు, వట్టికోట ఇలా ఎందరో సాహితీవేత్తలు, కవులకు నిలయం నల్లగొండ అని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో సాహిత్యం మరింత ప్రజ్వలించాలని ఆకాంక్షించారు.
సాహితీవేత్తలు, కవులకు మండలి చైర్మన్ గుత్తా శుభాకాంక్షలు
రామగిరి : సాహితీ దినోత్సవం సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సాహితీవేత్తలు, కవులు, కళకారులు, రచయితలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాతనే సాహిత్య రంగంలో గతంలో ఎన్నడూ లేని ప్రత్యేకత చాటామన్నారు. ప్రభుత్వం సైతం సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు, రచయితలకు పెద్దపీట వేసిందన్నారు. నల్లగొండ జిల్లాకు సంబంధించి ప్రతిజ్ఞాన రాసి పైడిమర్రి వెంకట సుబ్బారావుకు, వట్టికోట ఆళ్వారుస్వామికి ఎంతో గౌరవం దక్కిందన్నారు. తెలంగాణలో ఎంతో ఉన్నతమైన కవులు, సాహితీ వేత్తలు ఉన్నారని, వారిలో నల్లగొండలోని వ్యక్తులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తెలంగాణ ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో వీరి పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు.
ఎంతో అభివృద్ధి సాధించాం..
2014కు పూర్వం పోలీసులు ఊళ్లోకి వస్తుంటే ప్రజలు భయపడేవారని, కానీ నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ‘ఫ్రెండ్లీ పోలీస్’ వ్యవస్థతో ఎంతో మార్పు వచ్చిందన్నారు. నాడు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక పిల్లలు ఇబ్బంది పడ్డారని, నేడు ఆ పరిస్థితులు లేవని తెలిపారు. కార్పొరేట్, ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామన్నారు. కరువుతో అల్లాడిన ఉమ్మడి నల్లగొండ జిల్లా నేడు అభివృద్ధిలో పయనిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కవులు, సాహితీవేత్తలకు రూ.1,116 చొప్పున నగదు పారితోషకంతోపాటు జ్ఞాపికలను అందచేసి సన్మానించారు. చిన్నారుల సంప్రదాయ, సాంస్కృతిక, జానపద నృత్యాలు అలరించాయి. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్లు వినయ్‌క్రిష్ణారెడ్డి, వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు కుష్బూ గుప్తా, కేశవ్ హేమంత్ పాటిల్, ట్రైకార్ చైర్మన్ రాంచందర్‌నాయక్, సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైరన్లు మందడి సైదిరెడ్డి, పెరుమాళ్ల అన్నపూర్ణ, వివిధ శాఖల అధికారులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.