ఖైరతాబాద్, మే 31 : నిమ్స్ దవాఖాన ఎమర్జెన్సీ విభాగంలో బెడ్లు, స్ట్రెచర్ స్టాండ్లు సరిపడా లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అస్వస్థత, ప్రాణాపాయ పరిస్థితుల్లో దవాఖానకు వచ్చే రోగులకు అత్యవసర విభాగంలో నిరంతరం చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రతి నిత్యం రోగులు, క్షతగాత్రులతో కిటకిటలాడే ఎమర్జెన్సీ విభాగంలో చికిత్సకు ఉపయోగించే పలు పరికరాల కొరత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆదివారం ప్రమాదానికి గురైన ఓ వ్యక్తికి బెడ్ దొరుకకపోవడంతో స్ట్రెచర్‌పై ట్రీట్మెంట్ చేశారు.
ఆ తర్వాత అతనికి స్లైన్ ఎక్కించారు. అయితే స్లైన్ బాటిల్ పెట్టేందుకు స్టాండ్ అందుబాటులో లేకపోవడంతో రోగి సహాయకుడే దాన్ని చేతిలో పట్టుకోవాల్సి వచ్చింది. వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఓ యువకుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నిమ్స్ పరికరాల కొరత విషయం వెలుగులోకి వచ్చింది. బెడ్ల కొరత వల్లే స్ట్రెచర్లపై చికిత్స అందించాల్సి వస్తున్నదని అక్కడి ఓ వైద్యుడు చెప్పారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఎమర్జెన్సీ విభాగంలో సరిపడా పరికరాలు తెప్పించాలని రోగుల సహాయకులు కోరుతున్నారు.