జవహర్‌నగర్/ మేడ్చల్, మే 31: కేసీఆర్ సారు వస్తేనే… రైతుల కళ్లల్లో ఆనందం నిండుతుందని బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ధాన్యం రాశుల మీదే రైతులు చనిపోతున్న ఘటనలను మనుపెప్పుడూ చూడలేదని, రైతు కంట్లో కన్నీరు తప్పితే ఆనందమే కనిపించడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని జవహర్‌నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాగిడి లక్ష్మారెడ్డి, చామకూర మహేందర్‌రెడ్డిలు హాజరై మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదులో బీఆర్ఎస్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయి తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరాలేదని, ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పి మాయమాటలతో కాలం వెళ్ళదీస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని… ఎవరూ అధైర్య పడొద్దని, ఆపదవస్తే అండగా నిలుస్తామని ధైర్యం చెప్పారు.
ఉమ్మడి పాలనలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలంటే విదేశాల వైపు చూసేవాళ్ళమని… గత పదేళ్ళ నుండి ఐటీ రంగం తెలంగాణ వైపు చూస్తుందంటే ఈ ఘనత మాజీ మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. గతంలో కారు చీకట్లో కనిపించిన జవహర్‌నగర్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి చొరవతో రూ. 300 కోట్లతో జూబ్లీహిల్స్ మోడల్‌గా తీర్చిదిద్దారని మాజీ మేయర్ మేకల కావ్య కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీని జవహర్‌నగర్‌లో మరింత బలోపేతం చేస్తామని కొండల్ ముదిరాజ్ తెలిపారు. సభ్యత్వ నమోదు, సర్ ప్రక్రియపై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జిట్టా శ్రీవాణి శ్రీనివాస్‌రెడ్డి, సంగీతారాజశేఖర్, సతీష్‌కుమార్, పల్లపు రవి, మాజీ కోఆప్షన్ సభ్యురాలు శోభారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భార్గవ్‌రామ్, సోషల్ మీడియా కన్వీనర్ అహ్మద్‌పాషా, నాయకులు సుధాకర్‌చారి, బాల్‌రాజ్, ప్రసాద్, సతీష్, సిద్ధులు, వెంకటేష్, సోమయ్య, కృష్ణయాదవ్, బాల్‌నర్సింహా, ప్రకాశ్, పరశురామ్, మహేశ్, లక్ష్మణ్, శ్రీరాములు, మతిన్, నవీన్‌గౌడ్, బాలస్వామి, విక్రమ్, నర్సింహాయాదవ్, మంజుల, కేతమ్మ తదితరులు పాల్గొన్నారు.

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
మేడ్చల్, మే 31 : రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందుకోసం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్‌లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. గ్యారంటీలు, హామీలను అమలు చేయకుండా ప్రజల వచించిందన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతుందని విమర్శించారు.
ఎరువులు సకాలంలో అందించడం లేదని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు. తులం బంగారం, ఆసరా పింఛన్లను పెంచి అమలు చేయడం లేదని విమర్శించారు. స్థిరాస్థి రంగం పూర్తిగా కుదేలైందని, అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇలా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ప్రజలు మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్ఐఆర్)పై బూత్ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రతి బూత్‌లో ఉన్న ఓటర్లను పరిశీలించి, ఓటర్ల సవరణ కార్యక్రమంలో ఒక్క ఓటు కూడా రద్దు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే బీఆర్ఎస్ అనుకూల ఓట్లు రద్దై, ఎన్నికల్లో ఓటమిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీదేవి, నాయకులు భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, జగన్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, మల్లికార్జున స్వామి, రణదీప్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, విష్ణుచారి, సుదర్శన్, ప్రభాకర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.