హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ)/ తెలుగు యూనివర్సిటీ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 12 ఏండ్ల తర్వాత మళ్లీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. టీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. టీజేఎఫ్ ఏర్పాటై 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గన్‌పార్క్ వద్ద నిర్వహించారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, 12 ఏండ్ల అనంతరం ఆంధ్రానేతల విగ్రహాలను హైదరాబాద్‌లో పెట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలోనే సమైక్యాంధ్ర వాదుల కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన సంస్థ తెలంగాణ జర్నలిస్టుల ఫోరమని, మరోసారి తన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. టీజేఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీమాంధ్ర నేతల చెప్పు చేతల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. టీజేఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు రమణకుమార్, కందుకూరి రమేశ్‌బాబు, రమేశ్హజారి, నవీన్‌కుమార్, వెంకట్, వెంకటేశ్, ధన్‌రాజ్, రాకేశ్‌రెడ్డి, బాపురావు, శ్రీనివాస్, భాసర్, అజయ్ పాల్గొన్నారు.