పదేండ్లుగా నిరంతరం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ కావాలో? అభివృద్ధి పట్టని, కేవలం పదవుల కోసం పాకులాడే కాంగ్రెస్, బీజేపీ కావాలో? ప్రజలు తేల్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పద్మశాలి, ప్రైవేట్ ఉపాధ్యాయులు, వ్యాపార, దళిత సంఘాలతో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఇన్నేండ్లు అడ్రస్ లేకుండా పోయిన పార్టీలు ఎన్నికలు రాగానే నెరవేర్చలేని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఆ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించడంతోనే ఇంతటి ప్రగతి సాధ్యమైందని, మరింత అభివృద్ధికి గులాబీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. సూర్యాపేట మండలం పిన్నాయిపాలేనికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 19 : యావత్ దేశంలోనే మరెక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిరంతరాయరంగా కొనసాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమాల బీఆర్ఎస్ కావాలా? ఏమాత్రం అభివృద్ధి పట్టని, కేవలం పదవులే లక్ష్యంగా ఎంతటి నీచ రాజకీయాలకైనా దిగజారే కాంగ్రేస్, బీజేపీ కావాలో ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రజలను కోరారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పాలన కొనసాగించడమే సీఎం కేసీఆర్ నాయకత్వం తమకు నేర్పిందని.. ఆ నమ్మకంతోనే ప్రజలు రెండుసార్లు బీఆర్ఎస్కు వేసిన ఓటుతో అభివృద్ధిలో ఎంత మార్పు జరిగిందో ప్రజలంతా కండ్లారా చూస్తున్నట్లు చెప్పారు. మరోమారు ఓటు వేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లోనూ మరింత ప్రగతి సాధించుకుందామని తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పద్మశాలీ, ప్రైవేట్ టీచర్స్, వ్యాపార సంఘాలు, దళిత సంఘాలు స్వచ్ఛందంగా పలు చోట్ల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుని మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ఇన్నేండ్లు అడ్రస్ లేకుండా పోయి ఎన్నికలు సమీపించగానే ముసలి కన్నీరు కారుస్తూ నెరవేర్చలేని హామీలతో దోచుకునేందుకు వస్తున్న ఆయా పార్టీల నాయకులకు ప్రజలంతా ఏకమై తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అందరి కష్టాలు తెలిసుకుని వాటి పరిష్కారం దిశగా నిరంతర అభివృధ్ధి పాలన కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నట్లు వెల్లడించారు. నిరంతర విద్యుత్, కృష్ణా, గోదావరి జలాలతో పుష్కలంగా తాగు, సాగు నీరు అందుతుండడంతో పంటలు సంమృద్దిగా పండుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాయని.. దాంతో వలసలు వాపస్ రావడమే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడకు వలసలు పెరగుతుండడం మన అభివృద్ధికి నిదర్శనమన్నారు.
మరోమారు బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తే కేసీఆర్ నాయకత్వంలో రాబోవు రోజుల్లోనూ మరింత అభివృద్ధి సాధించుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు డాక్టర్ రామ్మూర్తియాదవ్, మొరిశెట్టి శ్రీను, అప్పం శ్రీనివాస్, గండూరి ప్రకాశ్, ఉప్పల ఆనంద్, బండారు రాజా, మారిపెద్ది శ్రీను, ఆకుల లవకుశ, తోట శ్యామ్, మోత్కూరి సందీప్, సోమరాజు, దూలం నగేశ్ పాల్గొన్నారు.
సూర్యాపేట టౌన్ : భక్తి శ్రద్ధలతో చేసే ప్రతి ఒక్కరి పూజలు ఫలించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో గల అయ్యప్ప స్వామి దేవాలయ సమీపంలో గల ధర్మ శాస్త్ర సన్నిధిలో ఏర్పాటు చేసిన పూజలో మంత్రి పాల్గొన్నారు. మాలదారులకు అన్న ప్రసాదాలు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎదుటి వారి ఆకలి తీర్చడంలో ఎనలేని సంతృప్తి కలుగుతుందన్నారు. మాలదారులు నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో చేస్తున్న పూజలు ఫలించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు గండూరి ప్రకాశ్, డాక్టర్ రామ్మూర్తియాదవ్, మొరిశెట్టి శ్రీనివాస్, దాచపల్లి శ్రీను, మద్ది శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.