తెలంగాణ ప్రాంతం వెనుకబడిపోవడానికి సమైక్య పాలకులే కారణమని, కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే నాటి పరిస్థితులే తలెత్తుతాయని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పదవుల కోసం కొట్లాటే కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తారో.. అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడే బీఆర్ఎస్కు ఓటేస్తారో ప్రజలు తేల్చుకోవాలని కోరారు. పెన్‌పహాడ్ మండలం అనంతారం, అన్నారం, నారాయణగూడెం, నాగులపహాడ్ గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వనివెన్నో అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. మరింత అభివృద్ధి కోసం మరోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు.
పెన్‌పహాడ్, నవంబర్ 11 : 60 ఏండ్ల కాంగ్రెస్ పాలన, 15 ఏండ్ల టీడీపీ, బీజేపీ సమైఖ్య పాలనలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారి ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలే దర్శనమిచ్చేవని బీఆర్ఎస్ సూర్యాపేట నియోజక వర్గ అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆనాటి గుర్తులను తెలంగాణ ప్రజలు ఇప్పటికీ మరవలేదని చెప్పారు. పదవులు లేక తోడేళ్ల అవతారమెత్తిన కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు వేస్తే వాళ్లు పదవులు అనుభవిస్తారే తప్పా సమాజ అభివృద్ధి, ప్రజల సంక్షేమం గాలికొదిలేస్తారన్నారు. అదే బీఆర్ఎస్కు ఓటు వేస్తే అభివృద్ధి కొనసాగింపుతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతూనే ఉంటాయని తెలిపారు. శనివారం మండలంలోని అనంతారం, అన్నారం, నారాయణగూడెం, నాగులపహాడ్ గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవులే ముఖ్యమని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేద్దామా ? లేదా మన పథకాల కోసం ఓటు వేద్దామా తెలంగాణ ప్రజలు, సూర్యాపేట నియోజక వర్గ ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో సూర్యాపేటలో ఊరూరుకు కొట్లాటలు, పోలీస్ స్టేషన్ కేసులు తప్పా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ప్రజా ప్రతినిధులు ఊరు అభివృద్ధి కోసం పనులు అడిగిన దాఖలాలు లేవన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు ఏ ఊర్లో చూసినా దుమ్ము దూళీ, మోకాల్లోతు బురద రోడ్లే దర్శనమిచ్చేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకతో కేవలం 10 ఏండ్లలో అన్ని గ్రామాలు, తండాలు సీసీ రోడ్లతో కళకళలాడుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ అప్పటి ఎమ్మెల్యేలు వేదాసు వెంకయ్య, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి హయాంలో కుంగిన దోసపహాడ్ బ్రిడ్జికి ఏడేైండ్లెనా మరమ్మతులు చేయలేదని దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏడు నెలల్లోనే బ్రిడ్జి పూర్తి చేసి మండల ప్రజలకు అంకితం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. విద్య, వైద్యం అభివృద్ధే తన లక్ష్యమని అందులో భాగంగానే ఇప్పటికే మెడికల్ కాలేజీ, ఐటీ టవర్ సూర్యాపేటలో నెలకొల్పినట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు రైతు బీమా, ఉచిత కరెంట్, రూ.లక్ష రుణమాఫి అందించి ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలే కాకుండా ప్రజల అవసరాలు గుర్తించి అప్పటికప్పుడు రూపొందించుకున్న సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ ప్రజలను ఆదుకున్నట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమం కోరి ఇంత మంచి పథకాలు తీసుకువచ్చి పాలన అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసుకుందామా ? లేదా తోడేళ్ల మాదిరి అధికారం కోసం అర్రులు చాస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేసి బంగారు తెలంగాణను చీకటిమయంగా మార్చుకుందామా ప్రజలే తేల్చుకోవాలని పేర్కొన్నారు.
మండలంలోని మహ్మదాపురం, నారాయణగూడెం, నాగులపహాడ్కు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మండలంలోని దోసపహాడ్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సద్దల యాదగిరి ఇటీవల మృతి చెందాడు. దశదిన కర్మకు మంత్రి హాజరై యాదగిరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేంధర్, బీఆర్ఎస్ నాయకులు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, మండాది నగేశ్, మామిడి అంజయ్య, తూముల ఇంద్రసేనారావు, మిర్యాల వెంకటేశ్వర్లు, పొదిల నాగార్జున, దంతాల వెంకటేశ్వర్లు, మస్తాన్, సర్పంచులు బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాయిలీ లక్ష్మి, ధన్యాకుల కోటమ్మ, మీసాల రమణ, ఎంపీటీసీ మామిడి రేవతి, కట్ల నాగార్జున, నకిరేకంటి భార్గవ్, కొండ జానకిరాములు పాల్గొన్నారు.
మండలంలో ఏకబిగిన ప్రచారాలతో కాస్త అలసట చెందడంతో మంత్రి అనంతారం ప్రచారంలో స్వల్ప విరామం తీసుకున్నారు. అనంతారం ప్రచారంలో ఉండగా విరామం తీసుకుని అక్కడ పక్కనే ఉన్న ఇంటి ముందు అరుగుపై సేదతీరారు. ఆ సమయంలో అరుగుపై ఉన్న వృద్ధులు, చుట్టూ చేరిన మహిళలతో కాసేపు ముచ్చటించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేస్తే ఇలాగే సంతోషంగా ఉంటారని చెప్పారు. ఓ సామన్యుడిలా మంత్రి తమలో కలిసిపోవడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.