తిరుమలగిరి, మే 14 : ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం తిరుమలగిరి మండలంలో పర్యటించిన కలెక్టర్ ఏఎస్ఆర్ రైస్ మిల్లును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు సెంటర్ నుంచి వచ్చిన ధాన్యం లారీలను వెంటనే దిగుమతి చేసుకోవాలని, హమాలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. అనంతరం తొండలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలోని రిజిస్టర్ లను తనిఖీ చేసి నాణ్యత కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గ్రేడింగ్ ను ముందే రైతులకు తెలియజేయాలని నిర్వాహకులకు సూచించారు.
అనంతరం రాజన్న కోక్యా నాయక్ తండాలోని నర్సరీని సందర్శించి బెడ్ లో ఉన్న ఖాళీలను, అందులో నూతన విత్తనంను వేసి వానాకాలం వరకు మొక్కల పెంపకం లక్ష్యం చేరుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఇసుక సకాలంలో అందుతుందా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని మేస్త్రికి తెలిపారు.
తొండ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థుల యూనిఫామ్ కుట్టు కేంద్రాన్ని సందర్శించారు. యూనిఫామ్‌లను పరిశీలించి నాణ్యంగా కుట్టాలని మహిళలను కోరారు. తొండ గ్రామ పంచాయతీని ఆకస్మితంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సివిల్ సప్లై మేనేజర్ ప్రసాద్, తాసీల్దార్ బి. ప్రసాద్, ఎంపీడీఓ లాజర్, ఏఓ నాగేశ్వరరావు, ఏపీఎం మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, ఆర్ఐలు పాల్గొన్నారు.