నకిరేకల్, ఏప్రిల్ 13 : నారుకు డబ్బులియ్యలేదు..నీరుకు డబ్బులియ్యలేదు..విత్తనపు వడ్లకు డబ్బులియ్యలేదు..నాట్లకు డబ్బులియ్యలేదు..యూరియా సరిపోను ఇయ్యలేదు..పెట్టుబడికి డబ్బులియ్యలేదు..మూడేండ్ల నుంచి రైతుబంధు డబ్బులియ్యట్లేదు..పదేళ్ల నుంచి లేని తాలు సమస్య ఇప్పుడెందుకు? మా రైతులపై ఏం హక్కు ఉందని అడుగుతున్నారు? 150 క్వింటాళ్ల ధాన్యం తూర్పార పడితే 30 కేజీల తాలు కూడా రాలేదు..కానీ రూ.12 వేలు ఖర్చయింది. ఏ అధికారి ఇస్తాడు? ఏ ఎమ్మెల్యే ఇస్తాడు? ఏ మంత్రి ఇస్తాడు? ఏ ముఖ్యమంత్రి ఇస్తాడు? మరి ప్రభుత్వం ఇచ్చిన 30 కేజీల విత్తనపు వడ్లలో 6 కేజీల తాలు ఎందుకు వస్తున్నది? ఈ విషయంపై అధికారులు ఎందుకు నోరు మెదపరు? తాలు తీస్తేనే వడ్లు కొంటామని ఏసీ రూముల్లో కూర్చొని అధికారులు, మిల్లర్లు మీటింగ్‌లు పెడుతున్నరు? అధికారులంతా కేంద్రాలకు రండి..మీ ముందే తాలు పట్టి చూపిస్తం. విత్తనపు వడ్లలో తాలు ఎలా వస్తుంది?..మరి మేం పండించిన పంటలో కాసింత తాలు రాదా? మా కష్టం విలువ ఏంటో తెలుస్తుందని నకిరేకల్ మండలం మర్రూర్ గ్రామ రైతులు సోమవారం నమస్తే తెలంగాణకు తమ గోడును విన్నవించుకున్నారు.
తీవ్ర జాప్యంతో రైతుల అరిగోస
నకిరేకల్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తూర్పార పట్టే మిషన్లు తగిన సంఖ్యలో లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సకాలంలో కొనుగోళ్లు జరగకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. కూలీల ఖర్చులు భరించలేక, ఎండలకు తట్టుకోలేక రైతులు అరిగోస పడుతున్నారు. మండలంలోని చీమలగడ్డ-1, చీమలగడ్డ-2, చందుపట్ల, నెల్లిబండ, మంగళపల్లి, తాటికల్, గోరెంకలపల్లి-1, గోరెంకలపల్లి-2, టేకులగూడెం, ఓగోడు, మర్రూర్, వల్లభాపురం, నోముల, మండలాపురం, కడపర్తి, బైరెడ్డిగూడెం, చందంపల్లి గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మొత్తం 17 కొనుగోలు కేంద్రాల్లో 17 ప్యాడీ క్లీనర్లు ఉన్నాయి. పెద్ద కేంద్రాల్లో 250 నుంచి 270 ధాన్యం కుప్పలున్నాయి. చిన్న కేంద్రాల్లో 170 నుంచి 200 కుప్పలున్నాయి.
కేంద్రానికి ఒక ప్యాడీక్లీనర్ మాత్రమే ఉండటంతో రోజుకు ఒకరిద్దరు రైతులు మాత్రమే తూర్పార పట్టాల్సిన పరిస్థితి వస్తోంది. పైగా ప్రభుత్వ ప్యాడీ క్లీనర్లలో ధాన్యం సరిగా శుభ్రం కాకపోవడంతో మిల్లర్లు కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీలేక రైతులు జేసీబీ, ట్రాక్టర్ ఫ్యాన్లు గంటకు రూ.1500 నుంచి రూ.2000 తెచ్చుకుని ధాన్యాన్ని తూర్పార పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇది ఇలా ఉంటే క్వింటాకు రూ.1850కి ఇస్తవా? 1950కి ఇస్తవా? అంటూ మిల్లర్లు బేరసారాలు ఆడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.30 వేల వరకూ నష్టం జరుగుతుందని, కొనుగోలు కేంద్రానికి తెస్తే మద్దతు ధర రూ.2389 వస్తుందని తెస్తే ఇక్కడ తాలు పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ కష్టం విలువ తెలుసుకుని ధాన్యాన్ని తొందరగా కాంటా వేసి దిగుమతి చేసుకునేలా చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు.
కలెక్టర్ సారూ.. మా బాధ పట్టించుకోండ్రి
నాకు ఐదెకరాల పొలం ఉంది. మర్రూర్ సెంటర్‌కు ధా న్యం తెచ్చి 15 రోజులు అవుతుంది. తాలు పడితేనే కాం టా పెట్టుకుంటామని అధికారుల చెబితే జేసీబీని అద్దెకు తెచ్చుకుంటే గంటకు రూ.2 వేలు తీసుకున్నడు. ఫ్యాన్ ట్రాక్టర్ గంటకు రూ.1500, ముగ్గురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున రూ. 3 వేలు ఖర్చయింది. మొత్తం రెండు గంటల 15 నిమిషాలు పట్టింది. దీనికైన ఖర్చు మొత్తం రూ.11వేలు. మూడు ట్రాక్టర్ల ధాన్యానికి అంటే 150 క్వింటాళ్లు పట్టేందుకు రూ. 11 వేలు ఖర్చు వస్తే.. అందులో 30 కేజీల తాలు మాత్రమే ఎల్లింది. మా వడ్లల్లో తాలు ఎక్కువ లేదన్నా అధికారులు పట్టించుకుంటలేరు. మిల్లర్లు తాలు ఉన్నా లేకున్నా తరుగు తీస్తేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామంటున్నరు. కలెక్టర్ సారూ మా బాధ పట్టించుకుని వడ్లు కాంటా వేయమని చెప్పండి.
-లొడంగి సైదులు, రైతు, మర్రూర్
10 సంవత్సరాల నుంచి తాలు సమస్య లేదు..
గత 10 సంవత్సరాల నుంచి లేని తాలు సమస్య ఇప్పుడెందుకు ముందుకు తీసుకొచ్చారు. మాయిశ్చర్ 16, 17 చూపిస్తున్నం. తాలు పట్టకపోతే మిల్లు వాళ్లు తీసుకుంటలేరని అధికారులు చెప్తున్నరు. ఎండకు తాలు పట్టాలంటే అదొక కష్టం. ట్రాక్టర్ ఫ్యాన్‌కు గంటకు రూ.1500 అడుగుతున్నరు. జేసీబీకి రూ.1200 తీసుకుంటున్నరు. నాకున్న 15 ఎకరాల్లో 12 ట్రిప్పుల వడ్లు ఎల్లినయి. వాటిని పట్టాలంటే రూ.30 వేలు ఖర్చు అవుతుంది. ఎన్నడూ లేని తాలు సమస్యను సృష్టించి మా రైతుల ను అధికారులు, మిల్లు యజమానులు వేధిస్తున్నరు. తాలు సమస్య లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నాం.
-బరిశెట్టి నగేష్, రైతు, మర్రూర్ ధాన్యం కేంద్రం
17 ప్యాడీ కీన్లరు ఇచ్చాం..
నకిరేకల్ మండలంలోని 17 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఒక్కొక్కటి చొప్పున 17 ప్యాడీ క్లీనర్లు ఇచ్చాం. వ్యవసాయ మార్కెట్ గోదాములో మరో 6 ప్యాడీ క్లీనర్లు ఉన్నాయి. ఎవరైనా కేంద్రాల నిర్వాహకులు అవసరముందని దరఖాస్తు చేసుకుంటే ఇస్తాం.
-ఎండీ షంషీర్, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి