న్యూఢిల్లీ, ఆగస్టు 12: వ్యవసాయ భూముల్లో హై-వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్లు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటుకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త నష్టపరిహార విధానాన్ని రైతులు తిరస్కరించారు. అంతకుముందు జూలై 4న పరిహారం చెల్లింపు ప్రాతిపదికన ‘జాంత్రీ’ రేట్ల నుంచి మార్కెట్ విలువకు మారుస్తూ, అలాగే నష్టపరిహారం మొత్తాన్ని ముందుగానే చెల్లింపునకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. అయితే తమ భూమి వినియోగాన్ని, భవిష్యత్తు విలువను పరిమితం చేసే మౌలిక సదుపాయాల వల్ల కలిగే ఆర్థిక భారాన్ని ఈ కొత్త విధానంలోనూ తామే భరించాల్సి వస్తున్నదని రైతులు అంటున్నారు.
లాటరీ విధానంలో లెక్కలు ఎలా వేయాలో తెలియక రైతులు అయోమయంలో పడతారని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రైతు నాయకులలో ఒకరైన నెహుల్ అమ్రుయా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఆందోళనలో మా గ్రామాల్లోకి బీజేపీ ప్రతినిధులను అనుమతించం అని రాసి ఉన్న బ్యానర్లను నిరసనకారులు ప్రదర్శిస్తున్నారు. ఖావ్డా రెన్యువబుల్ ఎనర్జీ పార్క్‌కు సంబంధించిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్(ఏఈఎస్ఎల్)కు చెందిన 765-కేవీ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా మొదట నిరసనలు ప్రారంభమయ్యాయి. తర్వాత కార్పొరేట్ సంస్థలన్నీ ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్మిషన్ లైన్లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మరింత విస్తృతమైన నిరసనగా మారింది.
విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అన్ని కంపెనీలను మేము వ్యతిరేకిస్తున్నాము. తమ పొలాల మీదుగా లైన్లు వెళ్తున్నా, లేకున్నా ప్రతి రైతుకూ అవగాహన కల్పించి వారిని చైతన్యం చేయడమే మా ఉద్దేశం అని అమ్రుయా అన్నారు. గుజరాత్‌లోని వివిధ జిల్లాల్లో 40 లక్షల బిఘాల భూమి, 4.50 లక్షల మంది రైతుల ప్రయోజనాలు దీనివల్ల ప్రమాదంలో పడ్డాయని ఆందోళన చేస్తున్న రైతు ప్రతీక్ పటేల్ చెప్పారు. స్తంభాలను ఏర్పాటు చేసినపుడు రైతులు భూమిని పూర్తిగా సాగు చేసుకోలేరు. ఈ స్తంభాలు, విద్యుత్ ప్రసార లైన్ల వల్ల భూమి విలువ తగ్గుతుంది. భవిష్యత్తులో వారు ఆ భూమిని పారిశ్రామికవేత్తలకు విక్రయించలేరు అని పటేల్ చెప్పారు.