కనగల్, ఏప్రిల్ 04 : జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుండి వలసలు వచ్చి పరిశ్రమలు నడవడానికి ఉపయోగపడుతున్న వలస కార్మికుల రక్షణ చేపట్టవలసిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని సీఐటీయూ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య అన్నారు. శనివారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కనగల్ మండలం కురంపల్లి మహావీర్ రైస్ ఇండస్ట్రీ, పర్వతగిరి వెంకటసాయి రైస్ ఇండస్ట్రీ లలో పనిచేస్తున్న కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ.. వలస కార్మికులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎలాంటి నష్ట పరిహారాలు పొందలేకపోతున్నారన్నారు.
రైస్ మిల్లులో హమాలీ పనులు, మిల్లు డ్రైవర్లుగా బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ లాంటి దేశం నుండి కూడా తెలంగాణకు వచ్చి పనులు చేస్తున్నారని, ప్రభుత్వం వలస కార్మికుల చట్టం పగడ్బందీగా అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. లేబర్ అధికారులు వలస కార్మికుల సంఖ్య సేకరించాలని డిమాండ్ చేశారు. ఈ సర్వేలో సీఐటీయూ కనగల్ మండల కన్వీనర్ నేలకొందరాసి లింగయ్య, హమాలీ యూనియన్ నాయకులు బురకల నరసింహ, కాడింగ్ భిక్షం, సూరజ్, పటేల్, సంతోష్, అరవింద్ పాల్గొన్నారు.