రామగిరి, ఆగస్టు 07 : మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్లగొండ సుభాశ్ విగ్రహం వద్ద కార్మికులతో కలిసి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ఐదు నెలల నుంచి వేతనాలు, బిల్లులు రావడం లేదన్నారు. అలాగే పది నెలల గుడ్ల బిల్లులు రాక కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కార్మికుల పెండింగ్ వేతనాలు, బిల్లులు, యూకుబేర్ నుంచి మినహాయించి గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించని యెడల సమ్మెకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ, జిల్లా నాయకులు దొడ్డి ఆండాలు, ఏకుల మహేశ్వరి, దేబోరా, వెంకటమ్మ, శంకరమ్మ, సైదమ్మ, నిర్మల, అలివేలు, ముత్యాలి, సుశీల, పుష్పలత, ఇందిర పాల్గొన్నారు.