– హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
– 57 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 22 మందికి పీహెచ్డీ పట్టాల పంపిణీ
రామగిరి, సెప్టెంబర్ 09 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నాల్గొవ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) ను ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. మంగళవారం వర్సిటీలోని తాన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కాన్వకేషన్‌కు ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా కాన్వకేషన్ వక్తగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్ మూర్తి హాజరు కానున్నట్లు వెల్లడించారు.
2007లో ప్రారంభమైన యూనివర్సిటీలో గతంలో పనిచేసిన సందర్భంలో తొలి కాన్వకేషన్ చేశామని, అదే స్ఫూర్తితో ఈ నెల 15న నాల్గవ కాన్వకేషన్ నిర్వహణకై సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ పర్యాయం యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పీహెచ్డీ పూర్తిచేసిన 22 మంది పరిశోధన విద్యార్థులకు పట్టాలు, యూనివర్సిటీ, అనుబందంగా ఉమ్మడి నల్లగొండలోని కళాశాలలోని పీజీ కోర్సులను పూర్తి చేసి యూనివర్సిటీ మొదటి స్థానం సాదించిన 57 విద్యార్థులకు బంగారు పతకాలను గవర్నర్, ముఖ్య వక్త చేతుల మీదుగా అందచేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా యూనివర్సిటీ, అనుబంద కళాశాలలో 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన 16,210, వివిధ పీజీ కోర్సులు పూర్తి చేసిన 3,200, బీఈడీ, ఎంఈడీ పూర్తి చేసిన 7,800 మంది విద్యార్థులకు ఆయా డిగ్రీ పట్టాలు ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఎంజీయూలో ఎల్ఎల్బీ, బి.పార్మసీ కోర్సుల నిర్వహణకై పరిపాలన అనుమతి లభించిందని వీసీ తెలిపారు. అదే విధంగా వీటితో పాటు ఎంఈడీ, బీపీఈడీ కోర్సుల ఏర్పాటుకై చర్యలు తీసుకుంటున్నట్లు, వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నప్పటికి ఎన్సీటీఈ నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఎల్ఎల్బీ, బి.పార్మసీ కోర్సులతో పాటు అనుమతి వస్తే ఎంఈడీ, బీపీఈడీ కోర్సులను 2026-27 విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు చేపట్టిన నూతన ప్రాజెక్టులు వారిలో ఉత్సాహాన్ని నింపి కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేశారని, దానిలో భాగమే ఎలక్ట్రికల్ వాహనం తయారీ అన్నారు. ఈ సమావేశంలో వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా. జి.ఉపేందర్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డా.లక్ష్మీప్రభ, డా.ప్రవళిక, డా.సంధ్యారాణి, బయో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొ.డా.రామచంద్రం పాల్గొన్నారు.