నల్లగొండ, జూన్ 14 : మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో మొట్ట మొదటి పీహెచ్డీ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి సూచించారు. శుక్రవారం ఎంజీయూలో నిర్వహించిన పరీక్షల సన్నాహక సమావేశంలో రిజిస్ట్రార్ పాల్గొని పలు సూచనలు చేశారు. విశ్వవిద్యాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రవేశ పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. పరీక్ష మొదటి విడుతగా శనివారం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు అన్ని సబ్జెక్ట్ల అభ్యర్థులకు రిసర్చ్ మెథడాలజీ పరీక్ష, రెండో విడుతలో మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు బిజినెస్ మేనేజ్మెంట్,
కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ అభ్యర్థులకు, 2 నుంచి 3 గంటల వరకు కామర్స్, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేటిక్స్ అభ్యర్థులకు, 3:30 నుంచి 4:30 గంటల వరకు గణితం అభ్యర్థులకు పరీక్ష నిర్వహించాలని సూచించారు. సీఈఓ డాక్టర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం 399 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు పొందాలని సూచించారు. నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని పేర్కొన్నారు. సమావేశంలో ఓఎస్డీ అంజిరెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆకుల రవి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె. అరుణ ప్రియ పాల్గొన్నారు.