– 57 మందికి బంగారు పథకాలు, 22 మందికి పీహెచ్డీ పట్టాల ప్రదానం
రామగిరి, సెప్టెంబర్ 15 : విద్యా, పరిశోధన ఆవిష్కరణలతో పాటు సేవారంగంలో పురోగతి సాధిస్తున్న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన నాల్గొవ కాన్వకేషన్‌కు ఆయన చాన్స్‌లర్ హోదాలో హాజరయ్యారు. వీసీ, రిజిస్టర్ తో పాటు జిల్లా అధికారులు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. తొలుత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు తయారు చేసిన సోలార్ ఎలక్ట్రికల్ వెహికల్ని పరిశీలించి విద్యార్థుల కృషిని అభినందించారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ బ్లాక్ వద్ద మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం జరిగిన కాన్వకేషన్‌లో 2022 నుండి 2024 వరకు వివిధ కోర్సులు పూర్తి చేసి యూనివర్సిటీ ప్రథమ స్థానంలో నిలిచిన 57 మంది విద్యార్థులకు బంగారు పతకాలతో పాటు కాన్వకేషన్ అందించారు. అదే విధంగా 22 మంది పీహెచ్డీ పూర్తిచేసిన పరిశోధన విద్యార్థులకు పట్టాలను కాన్వకేషన్ ప్రధాన వక్త ఐఐటీ హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ బి ఎస్ మూర్తి, ఎంజియూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ విద్య, పరిశోధన, ఆవిష్కరణ, సేవా కార్యకలాపాల్లో అద్భుత పురోగతి సాధిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యా బలోపేతానికి, హాస్టల్, క్యాంపస్ సౌకర్యాలను మెరుగుపరచడం, సమ్మిళిత అభ్యాస వాతావరణాన్ని పెంపొందించడంపై విశ్వవిద్యాలయం దృష్టి పెట్టడం ప్రశంసలకు అర్హమైందన్నారు. బలమైన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ను పెంపొందించడం కొనసాగించాలని, విశ్వవిద్యాలయాన్ని జాతీయ ఉన్నత సంస్థగా రూపొందించడంలో వారి మద్దతును ఉపయోగించుకోవాలని తాను సంస్థను కోరుతున్నట్లు తెలిపారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. ఐదు ట్రిలియన్ డాలర్ల మైలురాయి వైపు స్థిరంగా ముందుకు సాగుతోంది, త్వరలో మూడవ అతిపెద్దదిగా అవతరిస్తుంది. అభివృద్ధి సమాజంలోని ప్రతి వర్గానికి చేరినప్పుడే ఈ పెరుగుదల అర్థవంతంగా ఉంటుంది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వంటి విశ్వవిద్యాలయాలు సమ్మిళిత వృద్ధికి కీలకమైన శక్తులు అన్నారు.
ఈ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు విద్యార్థులను అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు, ముఖ్యంగా పరిశ్రమలు, విద్య, ఉపాధిని పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కృత్రిమ మేధస్సుకు సిద్ధం చేయాలన్నారు. 140 కోట్ల మంది జనాభాతో దేశ యువత నైపుణ్యం, దార్శనికత, వ్యవస్థాపకులుగా మారాలని చూస్తోంది, మన దేశం విశ్వ గురువుగా తన స్థానాన్ని తిరిగి పొందేందుకు, ఆత్మ నిర్భర్ భారత్ కలను నెరవేర్చుకునేందుకు వీలు కల్పిస్తుందన్నారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో నిర్వహిస్తున్న, నిర్వహించబోయే కోర్సులును వివరించారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అమలు చేయడంతో పాటు ప్రత్యేక క్రెడిట్స్ ను కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రధాన వక్త ప్రొఫెసర్ బి ఎస్ మూర్తి మాట్లాడుతూ.. నూతన పరిశోధనల వైపు విద్యార్థులు ఆలోచన చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎస్పీ శరత్చంద్ర పవార్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ తొలి వీసి ప్రొఫెసర్ గంగాధర్, పూర్వ రిజిస్టర్లు ప్రొఫెసర్ నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి, అసిస్టెంట్ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రభ, సంధ్యారాణి, ప్రవళిక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఆకుల రవి, ఐక్యుఏసీ డైరెక్టర్ డాక్టర్ మిర్యాల రమేష్ కుమార్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.మద్దిలేటి, బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్, యూనివర్సిటీ వివిధ విభాగాల బీన్స్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ప్రొఫెసర్ రేఖ, వర్సిటీ అధికారులు, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, అనుబంధ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, కాన్వకేషన్ బంగారు పథకాల దాతలు పాల్గొన్నారు.