– ఏప్రిల్ 6 వరకు రీవాల్యూయేషన్ దరఖాస్తులు
రామగిరి, మార్చి 25 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలలోని ఛాత్రోపాధ్యాయులకు పిబ్రవరిలో నిర్వహించిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి పరీక్షల నియంత్రణాధికారి డా.జి.ఉపేందర్‌రెడ్డి తో కలిసి బుధవారం విడుదల చేశారు. ఫలితాల రీవాల్యూయేషన్‌కు ఏప్రిల్ 6వ తేదీ వరకు గడువుగా పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ కై ప్రతి సబ్జెక్టుకు రూ. 200ను ఆయా కళాశాల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా విద్యార్థులు వారు రాసిన పరీక్షల సబ్జెక్టుల జవాబు పత్రాల జీరాక్స్ ప్రతులు కావాలనుకుంటే రూ.1000ని ఏప్రిల్ 6 లోగా వర్సిటీకి చెల్లించి తీసుకునే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా సీఓఈ మాట్లాడుతూ.. 1వ సెమిస్టర్ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,801 మంది విద్యార్థులు హాజరు కాగా 1,382 మంది ఉత్తీర్ణత సాధించారు. 813 మంది ప్రమోట్ అయ్యారు. 3వ సెమిస్టర్ పరీక్షలకు 2,713 మంది విద్యార్థులు హాజరు కాగా 2,440 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 283 మంది విద్యార్థులు ప్రమోట్ అయినట్లు తెలిపారు. కాగా 4 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా వారి ఫలితాలను వెల్లడించలేదన్నారు. ఫలితాల విడుదలలో అసిస్టెంట్ పరీక్షల నియంత్రణాధికారులు డా.లక్ష్మీప్రభ, కె. సంధ్యారాణి, డా.ప్రవళిక, డా.ఎస్. కళ్యాణి, డా.భిక్షమయ్య పాల్గొన్నారు.