పెన్పహాడ్, మే 18 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు శాపంగా మారాయి. మండుటెండల్లో పని చేసే కూలీలకు టెంట్లు, తాగునీరు కల్పన వంటి సౌకర్యాలకు కేంద్రం చెక్ పెట్టడంతో కార్మికులు వడదెబ్బకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. పెన్పహాడ్ మండలంలోని మాచారం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ చిత్రం ఎల్లమ్మ (55) ఉపాధి హామీ కూలికి వెళ్లి వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందింది.
ఎండాకాలంలో పనిచేసే వారికి గతంలో వేసవి భత్యంతో పాటు పని ప్రదేశంలో నీడ సౌకర్యం కోసం టెంట్లు, తాగునీరు, కూలీల పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక సిబ్బంది, వైద్యం కిట్, గడ్డపార, పార, తట్ట తదితర వస్తువులకు బిల్లులు వచ్చేవి. రెండేండ్లుగా ఉపాధి కూలీలకు చేతినిండా పని కల్పించకపోగా టెంట్లు, తాగునీరు, వైద్యం కిట్, తదితర సౌకర్యాలను రద్దు చేసింది. ఎల్లమ్మ మృతి ఎంపీడీఓ జానయ్య, ఏపీఓ నకిరేకంటి రవి, సర్పంచ్ ఇటుకల శ్రీనివాస్, ఆర్ఐ అజీజ్ నునిస నివాళులు అర్పించారు.