మేళ్లచెర్వు, ఫిబ్రవరి 9 : మేళ్లచెర్వులో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఇష్టకామేశ్వరీ సహిత స్వయంభూ శంభులింగేశ్వరస్వామి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఎదుర్కోళ్ల మహోత్సవం ద్వారా కల్యాణ మండపం వద్దకు చేర్చారు. అనంతరం యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాలు తదితర ఘట్టాలను మేళతాళాలు, వేదమంత్రాలతో అర్చకులు కొంకపాక రాధాకృష్ణమూర్తి, విష్ణువర్ధన్శర్మ, ధనుంజయశర్మ, భానుకిరణ్శర్మ, శివగోపాలశర్మ ఘనంగా నిర్వహించారు. జాతర రెండో రోజు శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
స్వామివారికి అభిషేకం నిర్వహించి పూలతో అలంకరించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈఓ కొండారెడ్డి ఆయనను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. జాతరలో భాగంగా నిర్వహిస్తున్న తెలుగు రాష్ర్టాల స్థాయి ఎద్దుల పందేలు ఉత్సాహంగా నడుస్తున్నాయి. దుకాణాలు, పిల్లల వినోద యంత్రాల వద్ద జన సందడి నెలకొన్నది. టీటీడీ కల్యాణ మండలంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానం రెండోరోజూ కొనసాగింది. విద్యుత్ ప్రభలపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ శాగంరెడ్డి శంభిరెడ్డి పాల్గొన్నారు.