మర్రిగూడ/ చండూరు, ఏప్రిల్ 30 : అనతి కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సహా కొందరు కాంగ్రెస్ దద్దమ్మలు మాట్లాడుతున్నారని, అది ఎవరి తరం కాదని పేర్కొన్నారు. మర్రిగూడ, చండూరు మండల కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించడం చేతగాక శ్వేతపత్రాలు, కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ అంటూ 3నెలలు కాలయాపన చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతన్నలు, ప్రజలు కరువుతో అల్లాడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అన్న వ్రస్ర్తానికి వెళ్తే ఉన్న వస్త్రం పోయిందన్న సామెతగా మారిందని ప్రజలు గుర్తించారని అన్నారు. తెలంగాణను బతికించేది కాళేశ్వరం ప్రాజెక్టు అని, కుంగిపోయిన పిల్లర్లకు, ఎత్తిపోతలకు సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూడలేక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి శంఖారావం పూరించారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ కూతురు కవితను జైలులో పెట్టినా.. కుంగిపోకుండా ప్రజల బాధలు తీర్చేందుకు బస్సు యాత్ర చేపట్టారన్నారు. బస్సు యాత్రకు లక్షలాది మంది ప్రజలు నీరాజనం పలుకుతుండటంతో కాంగ్రెస్, బీజేపీకి వణుకు మొదలైందని, ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిందని తెలిపారు. 16 ఎంపీ స్థానాలు గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన కొన్నాళ్లకే కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీని వీడుతున్నారని, అలాంటి వారిని భవిష్యత్‌లో తిరిగి పార్టీలో చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు. నాయకులను తయారు చేయడం బీఆర్ఎస్కు కొత్త కాదన్నారున. బడుగు, బలహీన వర్గాల అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు అండగా ఉంటా : క్యామ
భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటానన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనకంటే గొప్ప ఏమీ కాదని, భువనగిరిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ తాను అందుబాటులో ఉంటానని, బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం తనకు ఉన్నదని, ఇప్పుడున్న మంత్రులు తనకంటే గొప్పేమీ కాదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న వారికి ఎంపీ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ వీడుతున్న ఒకరిద్దరితో ఎలాంటి నష్టం లేదని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే సత్తా ఒక బీఆర్ఎస్కే ఉన్నదన్నారు. కేసీఆర్‌ను ఎదురోలేక తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సమావేశాల్లో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్వాయి స్రవంతిరెడ్డి, పల్లె రవికుమార్, మునగాల నారాయణరావు, వెంకటేశ్వర్రావు, ఎంపీ ఎన్నికల నియోజకవర్గ కో ఆర్డినేటర్ వెంకటనారాయణ గౌడ్, చండూరు మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ, ఎంపీపీ అవ్వారి గీత, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఇన్చార్జి ఎంపీపీ కట్కూరి వెంకటేశ్ గౌడ్, నాయకులు గుర్రం వెంకట్‌రెడ్డి, మెండు మోహన్‌రెడ్డి, అనంత రాజుగౌడ్, రామకృష్ణ, వెంకటరమణారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.