పెన్పహాడ్, డిసెంబర్ 02 : గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక రోగులకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్ నిల్వలు, పలు రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రి పరిధిలో గర్భిణుల వివరాల నమోదు, ఓపీ తదితర విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశ డే నెల వారి సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచేలా ఆశాలు, ఆరోగ్య సిబ్బంది తమ కార్యచరణను మెరుగు పరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య అధికారి రాజేశ్, డిపి.ఎం ఓ ఆనంద్, శ్రీనివాసరాజు, సీహెచ్ఓలు పాల్గొన్నారు.