సూర్యాపేట టౌన్, మార్చి 12 : వాస్తవాలను రాస్తూ సమాజానికి చూపించడమే నిజమైన జర్నలిజమని, ప్రతి విలేకరి జర్నలిజాన్ని సామాజిక బాధ్యతగా భావించి సమాజాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తూ ప్రజలకు వారధిలా పనిచేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. దుర్మార్గులను హీరోలుగా చూపించడం నిజమైన దుర్మార్గమని.. దుర్మార్గులను ఎండగడుతూ సమాజానికి ఉపయోగపడేలా మాత్రమే వార్తలుండాలని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు జరిగిన సూర్యాపేట జిల్లా జర్నలిస్టుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయతక్వంలో గత తొమ్మిదేండ్లుగా అన్ని రంగాల అభివృద్ధితోపాటు జర్నలిస్టుల సంక్షేమంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
జర్నలిస్టుల సంక్షేమ నిధి, హెల్త్ కార్డుల విషయంలోనూ మన రాష్ట్రం అన్ని విధాలుగా ముందున్నదన్నారు. జర్నలిస్టుల సొంతింటి కల కూడా త్వరలోనే నెరవేరనున్నట్లు చెప్పారు. ప్రతి జర్నలిస్టు వృత్తిని ఇష్టపడి బాధ్యతగా పని చేయాలని, అప్పుడే సమాజం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? త్వరగా పూర్తి కావాలంటే ఏం చేయాలి? అనే విషయాన్ని చూపడంలోనే నిజమైన జర్నలిజం ఉంటుందన్నారు. ప్రధానంగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రైతాంగ ఉద్యమంలో బీజేపీ నేతలు ట్రాక్టర్లతో తొక్కించి వందలాది మంది రైతుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వార్తల గురించి ఎన్ని పత్రికలు, టీవీలు సమాజానికి చూపించాయో ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు. వాస్తవాలను దాచిపెట్టడం జర్నలిజం కాదన్నారు. దేశాన్ని అన్ని విధాలుగా ఆగం చేస్తూ ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టిస్తున్నాడన్నారు. దేశాన్ని గుజరాత్‌లా మారుస్తానని చెప్పి మరీ మోసం చేస్తున్న మోదీ మాయలు ఇక్కడి బీజేపీ నాయకులకు అర్థం కావడం లేదన్నారు.
ఎన్నో ఎండ్లుగా మోదీ పాలిస్తున్న గుజరాత్ ఏ మాత్రం అభివృధ్ధి చెందిందో అన్ని రాష్ర్టాలకు తెలుసన్నారు. ఇప్పటికీ గుజరాత్లో పలు ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్న విషయం ఇక్కడి బీజేపీ నాయకులకు తెలియదా? అని ప్రశ్నించారు. అందుకే మోదీ మాటలకు అన్ని రాష్ర్టాల ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ మాదిరి సంక్షేమం దేశంలో మరెక్కడా లేదనే విషయం కూడా అన్ని రాష్ర్టాలకు తెలుసని పేర్కొన్నారు. అందుకే ఆయన నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటుందని తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, జర్నలిస్టు సంఘాల నాయకులు ఇస్మాయిల్, గుండా శ్రీనివాస్ గుప్తా, వజ్జె వీరయ్యయాదవ్, ఐతగాని రాంబాబు, పెద్దింటి శ్యాంసుందర్‌రెడ్డి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.