ఉత్సవాలను ప్రారంభించిన శాసన మండలి చైర్మన్ గుత్తా, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
రామగిరి, నవంబర్ 10 : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నల్లగొండలోని గడియారం సెంటర్లో గల హజ్రత్ సయ్యద్ లతీఫుల్లా షాఖాద్రి ఉర్సు ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా దర్గా వద్ద ముస్లిం మత పెద్దలు గంధానికి ప్రత్యేక నమాజ్ చేశారు. కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి హాజరై గంధాన్ని ఎత్తుకుని ఉత్సవాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి గంధాన్ని నల్లగొండ పుర వీధుల్లో ఊరేగించారు. రాత్రి దర్గా మెట్ల వద్దకు చేరుకున్న గంధానికి ముస్లిం మత పెద్దలు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. గంధాన్ని గుట్టపైకి తీసుకెళ్లడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
అధికారికంగా మూడు రోజులు ఉర్సు కొనసాగనుండగా నెల రోజుల పాటు ఈ ఉర్సుకు పెద్ద ఎత్తున తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నుంచి ముస్లింలు తరలివస్తారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ ఉర్సుకు హాజరవడం హర్షణీయమని పేర్కొన్నారు. గుట్టపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, ఉర్సు కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ జాఫర్, కార్యదర్శి చాంద్బాయి, కౌన్సిలర్లు పిల్లి రామరాజు యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీను, ఎడ్ల శ్రీను, ముతావల్లి జమాల్ ఖాద్రి, టీఆర్ఎస్ నాయకులు యామ దయాకర్, నిరంజన్ వలీ, దేవేందర్, ముస్లిం పెద్దలు, ఇనాందారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
గుట్ట కింద వెలిసిన దుకాణాలు
ఉర్సును పురస్కరించుకుని లతీఫుల్లా షాఖాద్రి ఉర్సు గుట్ట కింద ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సర్కస్‌తో పాటు పిల్లలకు ఆహ్లా దం పంచే స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో గుట్ట కింద సందడి కనిపించింది.