మర్రిగూడ, జూన్ 8 : ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతో సామాన్య జనం కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్ విలువ ఏకంగా మూడు రెట్లు పెరగడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు మోత మోగనున్నాయి. ప్రభు త్వం ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా భూముల విలువను పెంచి భూములు, ప్లాట్లు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లింది. ఫలితంగా రియల్ ఎస్టేట్, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడనున్నది.
హెచ్ఎండీఏ మరింత బాదుడు..
హైదరాబాద్ నగరానికి 65 కి.మీ. దూరంలో ఉన్న మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలను ప్ర భుత్వం హెచ్ఎండీఏ పరిధిలోకి తెస్తూ గతం లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ మం డలాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం భూ ములు, ప్లాట్లు మార్కెట్ విలువ మూడు రెట్లు పెరిగింది. గతంలో ఎకరం భూమి విలువ రూ.2లక్షల 50 వేల నుంచి రూ.3లక్షల వరకు ఉండగా రిజిస్ట్రేషన్‌కు 20వేల ఖర్చు అయ్యేది. ప్రస్తుతం సవరించిన విలువ ప్రకారం ఎకరం విలువ 10 లక్షల నుంచి 12లక్షల వరకు పెరగగా, రిజిస్ట్రేషన్‌కు రూ.80వేల నుంచి లక్ష వర కు ఖర్చు కానుంది. గతంలో ప్లాట్ మార్కెట్ విలువ 500 నుంచి 700 వరకు ఉండగా ప్రస్తుతం 1500 నుంచి 2000 వేల వరకు పెరిగింది.దాంతో 100 గజాల ప్లాటు రిజిస్ట్రేషన్‌కు గతంలో 10 వేలు ఖర్చుకాగా ప్రస్తుతం 30 వేలు అయ్యింది.
రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చం దంగా ఇప్పటికే పడిపోయిన రియల్ ఎస్టేట్‌పై పెరిగిన భూముల విలువ తీవ్ర ప్రభా వం చూపనున్నది. ఆపదకు అక్కరకు వస్తాయనుకున్న భూములు, ప్లాట్లు కొనే దిక్కు లేక రైతులు, వ్యాపారులు తల పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాపారులు, మధ్యవర్తులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిందని మం డల ప్రజలు చెబుతున్నారు.
హెచ్ఎండీఏతో ఒరిగేదేమీ లేదు..
మర్రిగూడ మండలాన్ని హెచ్ఎండీఏలోకి కలిపినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. భూముల విలువ ఇంతలా పెంచడం దారుణం. మారుమూల గ్రామాల ప్రజలపై ప్రభుత్వం భారం మోపడం సరికాదు. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో ఇంటి నిర్మాణంపై కూడా ప్రభావం పడుతుంది. ప్రభుత్వాన్ని నడపడానికి పేద ప్రజల ముక్కు పిండి వసూలు చేయాలా. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పనితీరుకు పెంచిన విలువలే నిదర్శనం.
-మారగోని వెంకటయ్య యాదవ్, రాజపేట తండా, మర్రిగూడ మండలం
పాత విధానమే కొనసాగించాలి..
పెంచిన ధరలతో తల్లిదండ్రుల పేరున ఉన్న భూమిని కొడుకు పట్టా చేసుకోవాలన్న రూ.లక్షల్లో ఖర్చు అయితట్టుంది. ఈ ప్రభుత్వం రైతులకు గుదిబండగా మారింది. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో పాత రిజిస్ట్రేషన్ ధరలనే కొనసాగించాలి. రైతే రాజు అన్న మాటకు ఆనవాళ్లు లేకుండా చేసేలా ప్రభుత్వ పనితీరు కనబడుతున్నది. గ్రామాల్లో ప్రజలపై భారం మోపడం దారుణం. చేతకాని ప్రభుత్వం వల్ల ప్లాట్లు కొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది.
-వీరమల్ల రాజు గౌడ్, అంతంపేట, గట్టుప్పల్ మండలం