ఈ నెల 21 నుంచి కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన సభలకు ఆదిలో చుక్కెదురైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షెడ్యూల్ ప్రకటించిన మర్నాడే ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడ్డం తిరిగారు. ఎవరికి చెప్పి షెడ్యూల్ ప్రకటించారని ఉత్తమ్ ప్రశ్నించగా నల్లగొండలో అసలు అవసరమే లేదంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాడెత్తేశారు. దీంతో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన సభను రద్దు చేయక తప్పలేదు. నిరుద్యోగ సభ పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నిరుద్యోగులు పెట్టుకుంటున్న సభలుగా మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. దమ్ముంటే నిరుద్యోగ మార్చ్‌లు గల్లీలో కాకుండా ఢిల్లీలో చేయాలంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగుల సమస్యలు, టీఎస్పీఎస్సీ లీకేజీలపై పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ నిరసన సభలు పెట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 18న ప్రకటించారు. తొలిసభ నల్లగొండలోని ఎంజీయూలో ఈ నెల 21న, తర్వాత ఖమ్మం, ఆదిలాబాద్ తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి అలా ప్రకటించారో లేదో ప్రత్యర్థి వర్గం భగ్గుమనడంతో నల్లగొండలో తలపెట్టిన తొలిసభనే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లగొండలో నిరుద్యోగ సభ పెట్టాలనుకున్నప్పుడు స్థానిక ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు రేవంత్‌రెడ్డి సమాచారం ఇవ్వలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రేవంత్‌రెడ్డి ప్రకటించిన మర్నాడు బుధవారం దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు.
తన ఎంపీ పరిధిలో పెట్టే సభకు తనకు ఇంతవరకు సమాచారమే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం లేకుండా సభలకు ఎలా వెళ్తామంటూ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తీరుపై ఉత్తమ్ ఏకంగా రాష్ట్ర ఇనాచార్జి మాణిక్‌రావ్ ఠాక్రేకు ఫిర్యాదదు చేసినట్లు తెలిసింది. నల్లగొండ సభ వద్దని, ఒకవేళ పెట్టినా తాను హాజరుకాలేనని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జత కలిశారు. తమ జిల్లాలో పెట్టే సభ సమాచారం ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ బలంగా ఉన్న నల్లగొండలో అసలు నిరుద్యోగ సభ అవసరమే లేదని స్పష్టం చేశారు. పార్టీ బలహీనంగా ఉన్న అదిలాబాద్లోనో… కరీంనగర్లోనో పెడితే ఉపయోగమని హితువు పలికారు. తమకు తెలవకుండా తేదీలు ప్రకటిస్తే ఎలా వెళ్లాలని, అప్పటికే తమకు ముందే నిర్ణయించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయంటూ మీడియాతో వ్యాఖ్యానించారు.
ఇద్దరూ నేతలు ఏఐసీసీ పెద్దలకు వేర్వేరుగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తొలిసభకు ఆదిలోనే హంసపాదులా మారినైట్లెంది. తప్పనిసరి పరిస్థితుల్లో నల్లగొండ సభను రద్దు చేస్తున్నట్లు పీసీసీ ప్రకటించక తప్పలేదు. నిరుద్యోగుల సమస్యలు ఏమో కానీ ముందు మీ పంచాయతీలను తేల్చుకోవాలంటూ కాంగ్రెస్ పెద్దలకు పార్టీ శ్రేణులు చురుకలు అంటిస్తుండడం విశేషం. నిరుద్యోగుల పేరు చెబుతూ కాంగ్రెస్‌లోని రాజకీయ నిరుద్యోగులు సభల పేరుతో డ్రామాలకు తెరలేపుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే గల్లీలో కాదూ ఢిల్లీలో నిరుద్యోగ మార్చ్‌లు చేయాలని హితువు పలికారు. గల్లీ నుంచి ఢిల్లీ దాక కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన పార్టీగా మారిందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతలకు మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు.