సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 20 : గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను ఆత్మకూర్.ఎస్ పోలీసులు అరెస్టు చేసి రూ.మూడు లక్షల విలువైన ఐదు కిలోల గంజాయి, కారు, బైక్, సెల్ ఫొన్లు సీజ్ చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నర్సింహ వివరాలు వెల్లడించారు. ఆత్మకూర్.ఎస్ గ్రామ శివారులో క్రషర్ మిల్లు వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. నెమ్మికల్‌కు చెందిన వీరబోయిన భరత్, జాజిరెడ్డిగూడెం, కొమ్మాల గ్రామానికి చెందిన అరె విజయ్, సూర్యాపేట మండలం ఆరెగూడానికి చెందిన చెవుల మనోజ్, నెమ్మికల్ గ్రామానికి చెందిన కొడిదల శివ జల్సాలకు అలవాటు పడి గంజాయి తెచ్చి విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
పథకం ప్రకారం భరత్, విజయ్, మనోజ్ ముగ్గురూ కలిసి కొడిదల శివకు చెందిన మోటార్ సైకిల్‌పై ఏపీలోని సీలేరుకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తెచ్చేవారు. తెచ్చిన గంజాయిని పంచుకునేందుకు నలుగురూ ఆత్మకూర్ శివారులోని క్రషర్ మిల్లు వద్దకు చేరుకున్నారు. నమ్మదగిన సమాచారం అందుకున్న ఆత్మకూర్ పోలీసులు అక్కడకు చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకొని, ఐదు కిలోల గంజాయిని, మనోజ్ కారును, శివ బైక్‌ను సెల్ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను అరెస్టుకు కృషి చేసిన సూర్యాపేట రూరల్ సీఐని, ఆత్మకూర్ ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశం లో సూర్యాపేట రూ రల్ సీఐ రాజశేఖర్, ఆత్మకూర్. ఎస్ ఎస్ఐ శ్రీకాం త్, సిబ్బంది పాల్గొన్నారు.