పెద్దఅడిశర్లపల్లి, మే 29 : గంజాయి సాగు చేస్తూ, విక్రయిస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా గుడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను ఏఎస్పీ మౌనిక గురువారం వెల్లడించారు. దుగ్యాల గ్రామానికి చెందిన నాగిళ్ల పాండరయ్యకు చెందిన వ్యవసాయం భూమిని పి.ఏ.పల్లి మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన ఇస్లావత్ చందు, ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన పండ్ల వ్యాపారి సింగారావు కౌలుకు తీసుకున్నారు. సింగరావుకు నాంపల్లి మండలం బండతిమ్మాపురం గ్రామానికి చెందిన కొత్తగొల్ల శ్రీను, రెవెల్లికి చెందిన వంగూరి శివతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారు సింగారావుకు గంజాయి విత్తనాలు ఇచ్చి సాగు చేయమని, వాటిని తామే కొనుగోలు చేస్తామని చెప్పారు.
వారు చెప్పిన విధంగానే సింగారావు పొలంలో గంజాయి సాగు చేపట్టాడు. మొక్కలు ఏపుగా పెరుగగా వాటిలో మూడింటిని శ్రీనుకు విక్రయించాడు. అతడు రూ.5 వేలు ఇవ్వగా ఇస్లావత్ చందు రూ.2 వేలు, సింగారావు రూ.3 వేలు తీసుకున్నారు. గంజాయి సాగుపై పక్కా సమాచారం అందుకున్న గుడిపల్లి పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి గంజాయి పంటను గుర్తించారు. 30 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ వెల్లడించారు. వారి వద్ద నుండి బైక్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపలి ఇన్చార్జీ సీఐ రాజు, గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు పాల్గొన్నారు. కేసును చేధించిన గుడిపల్లి పోలీసులకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందనలు తెలిపారు.