Manda Krishna Madiga : దేశవ్యాప్తంగా దళితులు, బీసీలపై, మహిళలపై అమానుష దాడులు పెరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఆందోళన వ్యక్తం చేశారు. కర్ల రాజేష్ (Karla Rajesh) మృతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పందించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. గాంధీనగర్లో శనివారం నిర్వహించిన కర్ల రాజేష్ సంతాప సభలో మందకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కస్టడీలో రాజేశ్ మరణానికి ప్రధాన కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దళితులపై దాడులను అడ్డుకోలేకపోతుందని మంగకృష్ణ మాదిగ విమర్శించారు. గతంలో కంటే ఈమధ్య దళితులపై దాడులు పెరిగాయని గణాంకాలతో సహా ఆయన వివరించారు. పోలీసుల చిత్రహింసలతోనే కర్ల రాజేష్ మృతి చెందాడని సాక్షాధారాలతో నిరూపించినప్పటికీ అధికార పార్టీ నేతలు ఎందుకు స్పందించడం లేదో ప్రజలు అర్థం చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ అధినేత అన్నారు. సందర్భం వచ్చినప్పుడు తగిన సమాధానం చెప్పాలని దళిత శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాజేశ్ కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. తమ సొంత నియోజకవర్గం దళిత బిడ్డ పోలీసు చిత్రహింసలకు మరణిస్తే కనీసం ఇప్పటివరకు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందించకపోవడం దారుణమని మందకృష్ణ అన్నారు. కర్ల రాజేవ్ సంతాప కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏపూరి రాజు, కొండపల్లి ఆంజనేయులు. కర్ల సుందర్ బాబు, గంధం పాండు, చీమ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
.