నల్లగొండ సిటీ, ఆగస్టు 30 : జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సెప్టెంబరు 2,3 తేదీల్లో ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్లో తన ఛాంబర్లో బుధవారం ఓటర్ నమోదుపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 2,3 తేదీల్లో ప్రత్యేక శిబిరాల సందర్భంగా బీఎల్ఓలు పోలింగ్ బూత్‌లలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు కానీ వారు, 1 అక్టోబర్ 2023 నాటికి 18 యేండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బీఎల్ఓలకు సహకరించాలని కోరారు.
ఈనెల 21నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు ముసాయిదా ఓటర్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబర్ 28 వరకు విచారణ చేసి అక్టోబర్ 4న తుది ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో ప్రస్తుతం 13,84,525 మంది ఓటర్లు ఉండగా పురుషులు 69,0072 మహిళలు 69,4335 ట్రాన్స్జెండర్లు 18 మంది ఉన్నారని తెలిపారు. సర్వీస్ ఓటర్లు 543 మంది కాగా పురుషులు 520 మంది మహిళలు 23 మంది ఉన్నట్లు తెలిపారు. ఆగస్ట్ 26,27 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో ఫారం 6,7,8 ఓటరు నమోదు మార్పులు చేర్పులపై 5,823 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బక్క పిచ్చయ్య, పోతెపాక లింగస్వామి, శంకర్‌నాయక్, నర్సిరెడ్డి, యాదగిరి, కుతుబుద్దిన్, మల్లికార్జున్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఎన్నికల డీటీ విజయ్ పాల్గొన్నారు.
నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని అడిషనల్ కలెక్టర్పాటిల్ హేమంత్ కేశవ్ పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నకిరేకల్ ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో బుధవారం ఓటింగ్ అవగాహన కార్య క్రమాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులతో, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఓటర్ల దరఖాస్తులను స్వీకరించాలని, మరణించిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు పూర్తిచేసుకున్న వారందరూ ఓటు హక్కు కలిగి ఉండేలా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో నకిరేకల్, రామన్నపేట, చిట్యాల, కేతెపల్లి, నార్కట్‌పల్లి, కట్టంగూర్ మండలాల తాసీల్దార్లు సీఐలు, ఎస్సైలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.