హుజూర్నగర్, జూలై 07 : ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసిన వ్యక్తి దోషిగా తేలడంతో అతడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హుజూర్నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరామ ప్రసాద్ మంగళవారం తీర్పు వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన యువతి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ తన వివాహ సంబంధాల కోసం మ్యారేజ్ బ్యూరోకు వివరాలను పంపించింది. ఆ విషయాలను తెలుసుకున్న హైదరాబాద్‌లోని బోడుప్పల్లో నివాసముంటున్న గొర్రె ప్రభుదాస్ ఆమెను సంప్రదించి తనను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. తను నిరుద్యోగి అయినందున తన అవసరాలకు కొంత డబ్బు కావాలని పలు దఫాల్లో తన నుండి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు. అంతేకాకుండా పలుమార్లు శారీరకంగా లొంగదీసుకున్నాడు.
అనంతరం అధిక కట్నం ఆశించి వేరే సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిసి తనను కలిసి నిలదీయగా బండబూతులతో దూషించి చంపుతానని బెదిరించాడని ఫిర్యాదు చేయగా అప్పటి గరిడేపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి మోసం, అత్యాచారం, దూషణ, బెదిరింపు, సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అప్పటి హుజూర్నగర్ సిఐ భాస్కర్ దర్యాప్తును పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల పూర్తి విచారణ అనంతరం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడు గొట్టే ప్రభుదాస్‌ను దోషిగా తేలుస్తూ మూడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, రూ.1,500 జరిమానా.. జరిమానా చెల్లించని పక్షంలో మరొక నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కు లైజన్ ఆఫీసర్ వెంకన్న సహకరించారు.