తుంగతుర్తి, ఏప్రిల్ 29 : ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగుపల్లి గ్రామానికి చెందిన భయ్యా కనకయ్య(33)కు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు రూ.50 వేలు అడిగాడు. కనకయ్య అంత ఇవ్వలేనని బతిమలాడగా రూ.20 వేలకు ఒప్పుకోవడంతో ఫోన్ పే ద్వారా చెల్లించాడు.
తర్వాత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో కనకయ్య పేరు లేకపోవడంతో డబ్బులు తీసుకున్న వ్యక్తి మోసం చేశాడనే ఆవేదనతో గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు.
అనంతరం బాధితుడు విలేకరులతో మాట్లాడుతూ తాను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తినని, గుంట జాగగాని, ఉండడానికి ఇల్లు గాని లేదని వాపోయాడు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో కొందరు కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లంచాలు తీసుకుంటూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా అధికారులు స్పందించిన తనకు న్యాయం చేయాలని కోరాడు.
ఇల్లు ఇవ్వకుంటే ఎమ్యెల్యే ఇంటిముందు చస్తా చండూరులో ఓ మహిళ ఆందోళన
చండూరు, ఏప్రిల్ 29 : ప్రభుత్వం తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఇంటిముందు ఆత్మహత్య చేసుకొని చనిపోతానని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే చండూరు మండలంలోని నెర్మట గ్రామానికి చెందిన పాలడుగు ముత్తమ్మ అనే దళిత మహిళ కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘గ్రామంలో ప్రకటించిన లిస్టులో నారు పేరు లేదు, పేద దళిత కుంటుంబానికి చెందిన నాకు ఆస్తులేమీ లేవు. భర్త కూడా చనిపోయిండు.. నాకు ఎందుకు ఇల్లు ఇవ్వలేదు’ అని ప్రశ్నించింది. డబ్బులు, భూములు, ఇండ్లు ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని ఆమె ఆరోపించింది. ఎమ్మెల్యే కొంత మంది ఓట్లు వేస్తే గెలువ లేదని, తాము కూడా వేశామని తెలిపింది. ప్రభుత్వం పథకాలు పేదలకు ఇవ్వరా అని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇంటిముందు ఆత్మహత్య చేసుకొని చనిపోతానని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.