నల్లగొండ, నమస్తే తెలంగాణ మార్చి 19 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చరిత్రను మరిచిపోకుండా భవిష్యత్ తరలాలకు అందేలా ఆమె పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని నల్లగొండ వన్‌టౌన్ సీఐ ఏ.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని సత్యావతి ఆస్పత్రిలో మల్లు స్వరాజ్యం మూడో వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మనవడు, ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు ఉచితంగా మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. వర్ధంతి కార్యక్రమానికి సీఐ రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమాయం అని, జీవితాంతం నిరుపేదల అభ్యున్నతి కోసం పరితపించారని గుర్తు చేశారు. ఆమె వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత మోకాలు మార్పిడి ఆపరేషన్ అభినయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆయన కోరారు.
డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం తన జీవితాన్ని అట్టడుగు వర్గాల కోసం ధారపోసిన గొప్ప వనిత అన్నారు. మహిళా హక్కులు, ప్రజల హక్కులు, పేదల భూముల కోసం చివరి వరకు జీవించారని గుర్తు చేశారు. ఆమె పేరుతో ప్రతీ యేటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నల్లగొండలోని సత్యవతి హాస్పిటల్ సహకారంతో మిర్యాలగూడకు చెందిన కార్మిక సంఘం నేత నకిరేకంటి అంజయ్య సతీమణి మరియమ్మకు విజయవంతంగా మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ చేసినట్లు వెల్లడించారు. గొప్ప వ్యక్తుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని భావిస్తున్నామన్నారు.
సత్యావతి హాస్పిటల్ ఎండీ డాక్టర్ రాంమనోహర్ మాట్లాడుతూ.. స్వరాజ్యం స్ఫూర్తిగా ఎన్నో కార్యక్రమాలు ప్రతీ సంవత్సరం చేయడం చాలా సంతోషకరమన్నారు. అందులో తమ హాస్పిటల్ భాగస్వామ్యం కావడం ఇంకా సంతోషంగా ఉందన్నారు. ఈ స్ఫూర్తితో తాము కూడా ఉచిత మెడికల్ క్యాంప్‌లు, నిరుపేదలకు ఉచిత సర్వీస్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతినెల మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే మల్లు వెంకట్ నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి నల్లగొండలోని సత్యవతి హాస్పిటల్ లో వారి మనవడు మల్లు అరుణ్ కుమార్ రెడ్డి చేస్తున్నట్లు చెప్పారు. వైద్య సేవలే కాకుండా విద్యార్థులకు కరాటే, ఉచిత కంప్యూటర్ శిక్షణ, మహిళలకు టైలరింగ్, క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తమ సంస్థ చేస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకుడు పుచ్చకాయల నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ శంకర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ సంపద, సత్యవతి వైద్యశాల ఎండి సత్యనారాయణ, కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్యాకల్టీ శంకర్ పాల్గొన్నారు.
Mallu Swarajyam : మల్లు స్వరాజ్యం స్ఫూర్తి కొనసాగేలా సేవా కార్యక్రమాలు : సీఐ రాజశేఖర్‌రెడ్డి