నందికొండ, జూలై 18: రాష్ట్రంలోని జల వనరులను సద్వినియోగం చేసుకుంటూ, జలవిద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను ఉపయోగంలోకి తీసుకువచ్చి డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నాగార్జుసాగర్ డ్యాం ప్రధాన జలవిద్యుత్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు అనంతరం జలవిద్యుత్ కేంద్రంలోని సమావేశ మందిరంలో రాష్ట్రంలోని జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలోని జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ల్లో ఉపయోగంలో లేని యూనిట్లను ఉపయోగంలోకి తేవాలని, విద్యుత్ ఉత్పత్తిలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు.
చేపట్టవలసిన పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కార్యాచరణపై క్యాలెండర్ రూపొందించి దాని ప్రకారం పనులు చేపట్టాలన్నారు. నూతన సాంకేతికతతో పురోగమించాలని, దానికి తగిన విధంగా మిషనరీ, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. ప్రతిఏటా విద్యుత్ వినియోగ డిమాండ్ పెరుగుతుందని, సంవత్సరలో 2000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి నూతన సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రపంచం పునరుత్పాదక శక్తి వైపు వెళ్తున్న దృష్ట్యా, దానిపై మనమూ దృష్టి సారించాలన్నారు.
గడిచిన సంవత్సర కాలంలో జెన్కో సిబ్బంది పద్ధతి ప్రకారం పనిచేయడం వల్ల ఎలాంటి బ్రేక్ డౌన్లు, విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్‌ను అందించమని, ఇందకు ఆ శాఖలోని అధికారులను, సిబ్బందిని అభినందించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ హరీశ్ వివిధ ప్రాజెక్టుల వివరాలను వివరించాడు. అనంతరం హిల్‌కాలనీలోని బుద్ధవనాన్ని సందర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలూనాయక్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, నారాయణ అమిత్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, సీఈలు మంగేశ్‌కుమార్, నారాయణ, ఎస్ఈలు తదితరులు పాల్గొన్నారు.