రామగిరి, జులై 05 : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని కోరుతూ ఈ నెల 9న చేపడుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో హమాలీ కార్మికులందరూ పాల్గొనాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, సీఐటీయూ నల్లగొండ టౌన్ కన్వీనర్ అవుట రవీందర్ పిలపునిచ్చారు. శనివారం నల్లగొండ పట్టణ ఎగుమతి, దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్టీల్, సిమెంట్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు వనమా దామోదర్, ఫెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావుకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కార్పోరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తుందని దుయ్యబట్టారు.
హమాలీ కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కనీస పెన్షన్ రూ.10 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు విఫలమైనట్లు తెలిపారు. 10 జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్స్ అన్నీ ఏకమై ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమ్మెలో నల్లగొండ పట్టణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు అద్దంకి నరసింహ, నల్లగొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అవురేషు మారయ్య, వీరయ్య, పరశురాం పాల్గొన్నారు.