– ప్రశ్నించే గొంతులను నొక్కిందుకే 30 సెక్షన్ విధింపు
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జనవరి 22 : దళిత బిడ్డ రాజేష్ మరణానికి బాధ్యులైన పోలీసులను శిక్షించాలని కోదాడ నియోజకవర్గంలో పోలీసులు ప్రతిపక్ష కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నెల 24న చేపట్టిన చలో కోదాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తాము చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే కోదాడలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయకూడదని పోలీసులు 30 యాక్ట్ ను విధించారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ చట్టాన్ని అమలుపరచకుండా కోదాడకు మాత్రమే వర్తింపజేయడం వెనుక మంత్రి ఉత్తమ్ దంపతుల హస్తముందని విమర్శించారు.
కోదాడ నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, అధికార పార్టీ తొత్తుగా మారిపోయింన్నారు. ప్రజల పక్షం నిలబడ్డ ప్రతి ఒక్కరిని బెదిరించడం ఇక్కడి నైజంగా మారిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకే తాము చలో కోదాడ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నియోజకవర్గ బిడ్డగా తాను రాజకీయాల్లోకి వచ్చిన తొలిదశలో తనను వెనుక పంపేందుకు చేసిన ప్రతి కుట్రను ఎదుర్కొన్నట్లు, చివరకు తనపై అక్రమ కేసులు బనాయించినా, భౌతిక దాడులు చేసినప్పటికీ ఎదురు నిలిచిన విషయం ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు.