– సంఘం సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజారాం
తుంగతుర్తి, సెప్టెంబర్ 04 : ఈ నెల 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజారాం నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 6న కార్మిక ప్రదర్శన, 7, 8 తేదీల్లో ప్రతినిధుల మహాసభ జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో నల్ల చట్టాలను ముందుకు తీసుకువస్తుందని, ఆ చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదనే విధంగా తీర్మానాలు చేపడతామన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానానికి, స్కీమ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బొంకూరు శ్యాంసుందర్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు కోట రామస్వామి, నరసయ్య, నజీర్, వెంకన్న, ఆంధ్రయ, హైమద్ ఖదీర్, శ్రీనివాస్, సత్యం, భిక్షపతి, యాకుబ్, సైదులు, మహేశ్, నరేశ్, సతీశ్ పాల్గొన్నారు.