పల్లెకు పండుగొచ్చె
సరదాల సంక్రాంతి సంబురాలను మోసుకొచ్చింది. పల్లె లోగిళ్లకు పండుగ శోభను తీసుకొచ్చింది. ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సొంతూళ్లకు తరలిరావడంతో గ్రామీణ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. చిన్నాపెద్దలతో సందడిగా మారాయి.
- నేడు భోగి,రేపు మకర సంక్రాంతి,ఎల్లుండి కనుమ
- సంక్రాంతి సందళ్లు షురూ..
- ఉత్సాహంగా ముగ్గులు, పతంగుల పోటీలు
- ఎన్‌హెచ్ 65పై వాహనాల రద్దీ
- సొంతూళ్లకు చేరుకున్న పట్టణ ప్రజలు
- ఉమ్మడి జిల్లా ప్రజలకు శాసనమండలి చైర్మన్ గుత్తా, మంత్రి జగదీశ్‌రెడ్డి శుభాకాంక్షలు
సరదాల సంక్రాంతి సంబురాలను మోసుకొచ్చింది. పల్లె లోగిళ్లకు పండుగ శోభను తీసుకొచ్చింది. ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సొంతూళ్లకు తరలిరావడంతో గ్రామీణ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. చిన్నాపెద్దలతో సందడిగా మారాయి. శనివారం భోగితో మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగ ప్రారంభం కానుండగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచే భోగి మంటలు మొదలయ్యాయి. ముత్యాల మగ్గులు, పతంగుల పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పండుగ ప్రయాణాలతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు దీరాయి. పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా ఎన్హెచ్ఏఐ, జీఎమ్మార్, పోలీస్ యంత్రాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతికూల ఆలోచనలు వదిలి సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సందేశాన్నిచ్చే భోగి పండుగ అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలని ఆకాంక్షించారు.
మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగ వచ్చింది. నేడు భోగి పండుగను నిర్వహించేందుకు పల్లెలు ముస్తాబమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ఉండేవారు సొంతూళ్లకు రావడంతో బంధువులు, కుటుంబ సభ్యులతో ప్రతి ఇల్లూ కళకళలాడుతున్నది. శనివారం భోగి సందర్భంగా అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలతో వాకిళ్లను అలంకరించేందుకు ఆడబిడ్డలు సిద్ధమవుతున్నారు. మార్కెట్లో ముగ్గుల రంగులు, రేగుపండ్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోవైపు సంక్రాంతికి జోష్ నింపే పంతంగుల ఎగురవేతకు చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఉత్సాహం చూపుతున్నారు. దుకాణాల్లో పతంగులు, దారాలు సిద్ధం చేసి విక్రయిస్తున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో ఊరూవాడ కోలాహలంగా మారనున్నది.
అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి
ఉమ్మడి జిల్లా ప్రజలంద రికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి. భోగి , సంక్రాంతి, కనుమ పండుగలను సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబించించేలా కుటుంబ సమేతంగా సంబురంగా జరుపుకోవాలి. ఇంటింటా ఆనందాలు వెల్లువిరియాలి.
– గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్
పండుగ సంబురాలతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి
- జిల్లా ప్రజలకు మంత్రి జగదీశ్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రతికూల ఆలోచనలు వదిలి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలనే సందేశాన్నిచ్చే సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు తీసుకురావాలి. ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ బోగి పండుగ శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందింపజేయాలి. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నా. మన సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి పండుగ. భోగి మంటలు, రంగవల్లులు తెచ్చే సంబురాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి. దేశ ప్రజల సంక్షేమమే సంకల్పంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారు.
బసవన్నల సందడి
మఠంపల్లి, జనవరి 13 : మకర సంక్రాంతి వేళ పల్లెలతోపాటు పట్టణాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ముచ్చటగా మూడు రోజులు జరుకొనే పండుగకు సందడి చేసేందుకు బసవయ్యలతో గంగిరెద్దోళ్లు సిద్ధమయ్యారు. సన్నాయి, మేళాలతో పాటలు పాడుతారు. దొరగారి ఇంటికొచ్చినం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఇంటింటికీ వెళ్లి కానుకలు పొందుతారు. సాక్షాత్తు శివయ్య మన ఇంటి ముందుకు వచ్చాడని ఆనందిస్తూ బసవయ్యలను ప్రజలు దైవంగా భావిస్తారు. మఠంపల్లి మండల కేంద్రంలో శుక్రవారం గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
కిక్కిరిసిన హైవే
- రద్దీగా 65వ జాతీయ రహదారి
- పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడవైపు 10 కౌంటర్లు ఓపెన్
చౌటుప్పల్ రూరల్, జనవరి13 : పట్టణవాసులు పల్లె బాటపట్టారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు సంక్రాంతి పండుగకు సొంతూళ్లో జరుపుకోవడానికి వెళ్తున్నారు. దాంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి రద్దీగా మారింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరి వెళ్తున్నాయి. శనివారం భోగి, ఆదివారం సంక్రాంతి కావడంతో శుక్రవారం భారీగా వాహనాలు బయల్దేరాయి. కొంతమంది ట్రాఫిక్ దృష్ట్యా బైక్‌లపై కూడా వెళ్తున్నారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద 16 కౌంటర్లు ఉండగా విజయవాడ వైవు 10 కౌంటర్లు తెరిచారు. ఫాస్టాగ్ ఉన్నా వాహనాలు 2-3 సెకండ్లలోనే టోల్‌ప్లాజాను దాటుతున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాలకు 5నిమిషాలు పైగా పడుతున్నది. ప్రతినిత్యం ఫాస్టాగ్ లేని వాహనాలు 100పైగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఎన్హెచ్ఏఐ, జీఎమ్మార్, పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చౌటుప్పల్ పట్టణకేంద్రంలో కూడా వాహనాలు బారులుదీరుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు తంగడపల్లి క్రాస్ రోడ్డును మూసివేశారు. తంగడపల్లి మీదుగా సంస్థాన్‌నారాయణపురం వెళ్లే వాహనాలను నాగారం క్రాస్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు.
కొర్లపహాడ్టోల్ప్లాజా వద్ద ఏడు కౌంటర్లు ఓపెన్
కేతేపల్లి : 65వ జాతీయ రహదారి కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతున్నది. మొత్తం కౌంటర్లకుగానూ విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 7 కౌంటర్లను తెరిచి ఉంచారు. ట్రాఫిక్ నియంత్రణకు పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వేగనియంత్రణకు స్పీడోగన్స్ ఏర్పాటు చేసినట్లు కేతేపల్లి ఎస్ఐ ఎం.అనిల్‌రెడ్డి తెలిపారు.
హైవే క్రాసింగ్‌ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు
కట్టంగూర్ : సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లే వాహనాల రద్దీతో క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరగకుంగా పోలీసులు, జీఎమ్మార్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కట్టంగూర్ మండల పరిధిలో సుమారు 15 కిలో మీటర్లలో ఐదు చోట్ల ప్రమాద స్పాట్లుగా గుర్తించి చర్యలు చేపట్టారు. ఎరసానిగూడెం స్టేజీ సమీపంలోని బస్‌షెల్టర్ వద్ద పోలీస్ చెక్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఎస్ఐతో పాటు ముగ్గురు ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బందిని నియమించారు. జీఎమ్మార్ అధికారులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రెస్క్యూ టీంలు, క్రేన్‌ను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రమాదాలు జరిగిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1033కు కాల్ చేస్తే అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
ఊరెళ్తున్నారా ? ఇల్లు జాగ్రత్త
- పండుగ సందడిలో దొంగతనాలకు అవకాశం
- తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా దోపిడీ
- అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
నేరేడుచర్ల, జనవరి 13 : సంక్రాంతి పండుగకు కుటుంబ సమేతంగా ఊరికెళ్తున్నారు. ఊరెళ్లే హడావుడిలో ఇంటి భద్రత, విలువైన వస్తువుల గురించి మరిచి పోతుంటారు. ఇదే అదునుగా భావించి దొంగలు పడే అవకాశాలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు
- ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఇంటిని చూసుకోవాలని చుట్టుపక్కల వారికి చెప్పడం మంచిది. అపార్టుమెంట్ అయితే వాచ్‌మన్‌కు చెప్పాలి.
- ఊళ్లకు వెళ్లే వారు ఇంటికి ఒకటికి రెండు తాళాలు వేసుకోవాలి.
- దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీసుస్టేషన్లో అందజేయాలి.
- రాత్రివేళ కొత్తవారు ఎవరైనా వచ్చినా వారి వివరాలు తెలుసుకొని రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని అపార్టుమెంట్ వాచ్మన్లకు చెప్పాలి.
- అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
- ఇంట్లో బంగారు, నగదు ఉంటే వాటని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం.
- ప్రయాణాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు చేతి సంచుల్లో, కర్ర బ్యాగుల్లో పెట్టొద్దు.
- ప్రయాణాల్లో కొత్తవారితో అప్రమత్తంగా ఉండాలి. వారితో పరిచయం పెంచుకోవడం మంచిది కాదు.
- అనుమానాస్పద వాహనాల్లో ప్రయాణించొద్దు.
- ఇంటి కిటికీలను మూసేయాలి. వాటికి ఉన్న బోల్డ్‌లు బిగువుగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
- బంగారు ఆభరణాలు ధరించి ఆరుబయట నిద్రించొద్దు. ఇంట్లో పడుకున్నా కిటికీలు తెరిచిన వైపు పడుకోవొద్దు.
- దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలు, తలుపులకు తగిలించొద్దు.
- వీలైతే ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కలను పెంచుకోవాలి.
- ఇంట్లో ఎలాంటి శబ్ధం, అలికిడి వినిపించినా అప్రమత్తం కావాలి. అలసత్వం ప్రదర్శించొద్దు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్






