నేరేడుచర్ల, జూలై 28 : వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించింది. అన్నదాతలను సంఘటితం చేయడం, వారికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేయడం, నూతన సాగు విధానాలు, వ్యవసాయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలను నిర్మించింది. వాటిల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో రైతులు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనువుగా ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం కూడా వాటిలోనే సమావేశాలు నిర్వహిస్తున్నది. కానీ ప్రతి నెలా వాటి నిర్వహణకు ఇచ్చే రూ.9వేలు మాత్రం విడుదల చేయ డం లేదు.
సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు ఉండగా ప్రతి మండలంలో 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. ఈ విధంగా జిల్లాలో 82 క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్లో రూ. 22లక్షలు వెచ్చించి రైతు వేదిక భవనాలను సర్వాంగ సుందరంగా చేపట్టి అందుబాటులోకి తె చ్చింది. అందులోనే వ్యవసాయాధికారులు రైతులకు సాగు సమయంలో సలహాలు, సూచలను ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది.
ఒక్కో రైతు వేదిక నిర్వహణ కోసం గత ప్రభుత్వం తొలుత ప్రతి నెలా రూ.3వేలు మాత్రమే ఇచ్చినప్పటికీ నిర్వహణ భారంగా మారుతుందని గుర్తించి ఆ తర్వాత దానిని రూ. 9వేలకు పెంచింది. వాటిని రైతు వేదిక పేరుమీద బ్యాంకు ఖాతా తెరిచి ప్రతినెలా నేరుగా అందులో డబ్బులు జమ చేసింది. ఆ నిధులను విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపు, క్లీనింగ్, శానిటేషన్, ఫర్నిచర్ వంటి ఖర్చులకు ఉపయోగించుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు వేదికల నిర్వహణను గాలికి వదిలేసింది. ప్రభుత్వం రైతు వేదికల నిర్వహణ, వాచ్మెన్ వేతనాలు చెల్లించకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతు సేవలో వేదికలు
రైతు వేదికలు అన్నదాలకు ఎంతో సేవ చేస్తున్నాయి. ఎరువులు, విత్తనాల సమాచారం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, నూతన విధానాలపై రైతు వేదికల నుంచే రైతులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు. అవగాహన సదస్సుల కోసం వచ్చిన రైతులకు ఇబ్బందులు కలుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కుర్చీలు, మిషన్ భగీరథ నీరు, మైకులు గత ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కానీ సంవత్సర కాలంగా నిధులు విడుదల కాక రైతు వేదికల నిర్వహణ భారంగా మారుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని పలువురు వ్యవసాయాధికారులు కోరుతున్నారు.
ఒక్కో రైతు వేదికకు నెలకు అయ్యే ఖర్చు
అంశం : రూపాయలు
విద్యుత్ చార్జీలు : 1,000
తాగునీటికి : 500
ఊడ్చేవారికి వేతనం :3,000
స్టేషనరీ, జీరాక్స్ : 1,000
రైతు శిక్షణ శిబిరాలు, శానిటరీ, మిని లైబ్రరీ : 2,500
మరమ్మతులు, తదితరాలు : 1,000