మునుగోడు మార్చి16 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన, విద్యా విధానాలకు వ్యతిరేకంగా తమ పాలన కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వాలను భగత్ సింగ్(Bhagat Singh) స్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని పోరాటాలకు సిద్ధం కావాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు. స్థానిక మండల కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) మునుగోడు మండల 9వ మహాసభలు ఆదివారం కామ్రేడ్ యాసరాని శివ నగర్ లో యాసరాని వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం భగత్ సింగ్ అతి చిన్న వయసులో ఉరికంబాన్ని ఎక్కి స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం వదులుకున్నారని గుర్తు చేశారు.
ఈ పాలక ప్రభుత్వాలు యువజన రంగం పట్ల, విద్యారంగం పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని బడ్జెట్లో ఈ రంగాలకు అరకొర నిధులను కేటాయిస్తూ ఈ రంగాలను నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన వ్యతిరేక విధానాల పట్ల యువత మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కార్యదర్శిలు కట్టా లింగస్వామి, మిరియాల భరత్, సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, మాజీ డివైఎఫ్ఐ నాయకులు పగిల్ల పరమేష్, పగిళ్ల యాదయ్య, డివైఎఫ్ఐ మండల నాయకులు బొడ్డుపల్లి నరేష్, చెనగోని గణేష్, ఎండి సిద్దిక్, మలిగ శివ, లింగస్వామి, శ్రీను, వెంకటేష్, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.