రామగిరి, జూన్ 11: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహత్మాగాంధీ యూనివర్సిటీకి న్యాక్ బీ+ గ్రేడ్ లభించింది. 2028 సంవత్సరం వరకు వర్సిటీ ఇదే హోదాలో యూజిసీలో కొనసాగనున్నది. గతంలో న్యాక్ ‘బీ’ గ్రేడ్ ఉండగా .. ప్రస్తుతం కొంత మెరుగు పడడంతో రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీలకు దీటుగా సకల సౌకర్యాలు అందనున్నాయి. వర్సిటీలోని అన్ని విభగాల్లో పూర్తిస్థ్ధాయిలో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడం, ఆయా విభాగాల్లో రీసెర్చ్ లేనందునే 0.5 పాయింట్ల తేడాతో బీ++ గ్రేడ్‌ను కోల్పోయింది. అయినా గతం కంటే హోదా పెరుగడంతో వీసీ సీహెచ్. గోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ టి.కృష్ణారావు, ఓఎస్డీ అల్వాల రవి హర్షం వ్యక్తం చేశారు.
న్యాక్ ఇలా : యూనివర్సిటీలో అమలు చేస్తున్న బోధన, పరిశోధన నైపుణ్యాలు, పూరిస్థ్ధాయిలో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ‘నేషనల్ అసిస్మెంట్ అండ్ అక్రెడేషన్ కౌన్సిల్(న్యాక్) ఉన్నత విద్యాసంస్థలకు గుర్తింపు ఇస్తున్నది. ఎంజీయూ న్యాక్ హోదా ముగియడంతో వర్సిటీ సెల్ఫ్‌రిపోర్ట్ స్టడీని యూజీసి, న్యాక్‌కు సమర్పించారు. మే 24 నుంచి 26 వరకు ఎంజీయూలో న్యాక్ బృందం పర్యటించింది. అన్ని విభాగాలను తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకొని వెళ్లింది. ఆదివారం దాని ఫలితాలు వెల్లడిస్తూ ఎంజీయూకు బీ+ గ్రేడ్ అందించిది.
కొద్దిలో కొల్పోయిన బీ++ హోదా
ఎంజీయూలో 2016లో న్యాక్ బృందం పర్యటించి అప్పటి వసతులకు అనుగుణంగా 2.32 సీజీపీఏ పాయింట్స్‌తో బీ గ్రేడ్ అందించిది. ఆ తర్వాత ఐదేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధితో పాటు విద్యార్థులకు మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన గుణాత్మక విద్యను అందుబాటులోకి తెచ్చారు. దాంతో ఇటీవల వచ్చిన న్యాక్ బృందం ఆయా అంశాలను పరిశీలించి 2.65 సీజీపీఏ ఇవ్వగా దానికి అనుగుణంగా న్యాక్ బీ+ గ్రేడ్ వచ్చింది. అయితే మరో 0.5 సీజీపీఏ వచ్చి ఉంటే బీ++ హోదా వచ్చేది. ఇందుకు కారణం ఎంజీయూలో అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడం, పరిశోధనలు(రీసెర్చ్) లేకపోవడమే కారణమని వర్సిటీ అధికారులు వెల్లడిస్తున్నారు.
హోదా పెరుడగం సంతోషంగా ఉంది
గతంలో ఎంజీయూకు న్యాక్ బీ గ్రేడ్ మాత్రమే ఉంది. నేను వీసీగా వచ్చినప్పటి నుంచి అటు పాలకమండలి, ఇటు ప్రభుత్వం, విద్యాశాఖ సహకారంతో పలు అభివృద్ధి అంశాలను అందుబాటులోకి తెచ్చాం. అయితే 0.5 పాయింట్స్‌తో న్యాక్ బీ++ హోదా కొల్పోవడం బాధకరం. అయినా గతం కంటే హోదా పెరిగి ప్రస్తుతం బీ+ రావడం సంతోషంగా ఉంది. అందరి సహకారంతో సమిష్టి కృషితోనే న్యాక్ బీ+ సాధించగలిగాం. రాబోయే కాలంలో మరింత అబివృద్ధిలోకి తెచ్చి న్యాక్ హోదా పెంచుతాం. ఈ హోదా సాధించడంతో భాగస్వామ్యమైన వర్సిటీ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బందికి అభినందనలు.
– గోపాల్‌రెడ్డి, వీసీ, ఎంజీయూ