యాదాద్రి భువనగిరి, జూలై 29 (నమస్తే తెలంగాణ) : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో పని దినాలు పెరిగాయి. మూడు నెలల్లో సుమారు నాలుగు లక్షల పని దినాలు అధికంగా కల్పించారు. జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు 131శాతం పని దినాలు పూర్తయ్యాయి. ఉపాధి కూలి కూడా అధికంగా చెల్లించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వంద శాతం పని దినాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి ఉపాధి కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. రైతులు, కూలీలకు ఆర్థిక సహకారం అందించేందుకు ఇది తోడ్పడుతున్నది. జిల్లాలో 1,41,351 జాబ్ కార్డులు ఉండగా, 2024-25 సంవత్సరానికి 32,57,979 పని దినాలకు లేబర్ బడ్జెట్ తయారు చేశారు. పనులను గుర్తించి గ్రామసభల ఆమోదం పొందడం జరిగింది. జిల్లాలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి 3,81,746 పని దినాలు పెరిగాయి.
గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మొత్తం 17,12,726 పని దినాలు కాగా, ఈ ఏడాది 20,94,472 పని దినాలు కల్పించారు. మొత్తంగా 131 శాతం పని దినాలు పూర్తయ్యాయి. రాజాపేట మండలం మినహా అన్ని చోట్ల మంచి ఫలితాలు వచ్చాయి. తుర్కపల్లిలో 41,461, బీబీనగర్‌లో 41450, ఆత్మకూర్ (ఎం)లో 40,562, బొమ్మలరామారంలో 34,719 పని దినాలు పెరిగాయి. కూలి కూడా వీలైన ఎక్కువగా ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వేజ్ రేట్ రూ.300 కాగా, ప్రస్తుతం 229 చెల్లిస్తున్నారు. కూలీల వివరాలను పని ప్రదేశంలోనే ఫీల్డ్ అసిస్టెంట్ ఫోన్లో నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు.
వంద శాతం ఉపాధి లక్ష్యం
జాబ్ కార్డులు ఉన్నవాళ్ల ఉపాధి హామీ పని కల్పి స్తాం. ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో పనులు చేపడుతున్నాం. మూడు నెలల్లోనే సుమారు 4 లక్షల పని దినాలు అధికంగా కల్పిం చాం. ఇప్పటికే 131 శాతానికి చేరుకున్నాం. పర్యవేక్షణ, ఫోకస్‌తోనే ఇది సాధ్యమైంది. వంద శాతం ఉపాధి పని దినా లు కల్పించడమే లక్ష్యం. కూలి కూడా పెంచాం.
– కృష్ణన్, డీఆర్డీఓ