భువనగిరి అర్బన్, జనవరి 25 : ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలని భాదిత రైతులు కదం తొక్కారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా చేపట్టారు. ధర్నా కోసం ముందుగానే డీసీపీ రాజేంద్రచంద్రకు వినతిపత్రం సమర్పించగా, అనుమతించారు. దాంతో రైతులు శుక్రవారం రాత్రి నుంచే మహాధర్నాకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా టెంట్లు, కార్పెటుల, ఇతర వసతులను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, తెల్లవారే సరికి పోలీసులు ధర్నా స్థలంలో వేసిన టెంట్లు, కార్పెట్లను ఎత్తివేశారు. రైతులు కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా భువనగిరి-రాయగిరి రహదారిలో బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటుచేసి రహదారిని దిగ్బంధించారు. దాంతో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ నాయకులతో కలిసి ట్రిపుల్ బాధిత రైతులు రోడ్డుపైనే ధర్నా చేశారు. అలైన్మెంట్ మార్చాలని నినదించారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లి తమ సమస్యను విన్నవించుకుంటామని రైతులు కోరినా పోలీసులకు వినకుండా అడ్డుకుని తోసేశారు. మహిళా రైతులను కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వావాదం జరిగింది. ధర్నా నిర్వహించవద్దని, కలెక్టరేట్‌లోకి వెళ్లొద్దని రైతులను, రైతుల పక్షాన ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్‌ను డీసీపీ రాజేశ్చంద్ర అడ్డగించారు.
ప్రభుత్వం రైతుల సమస్యను కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అధికారులకైనా విన్నవించుకునే అవకాశం కల్పించకపోతే రైతులు పరిస్థితి ఏంటని పైళ్ల ప్రశ్నించడంతో కేవలం నాలుగురికి అవకాశం ఇస్తామని డీసీపీ చెప్పారు. దాంతో ఇద్దరు రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, క్యామ మల్లేశ్ కలెక్టరేట్‌లోకి వెళ్లారు. అప్పటికే కలెక్టరేట్లో ఉన్న ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులు ఎనబోయిన ఆంజనేయులు, జనగాం పాండు, గాదె నరేందర్‌రెడ్డి, సిద్దుల పద్మ, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాగారం సూరజ్, అబ్బగాని వెంకట్, రైతులు పాల్గొన్నారు.
అలైన్మెంట్ మారుస్తామన్న వాళ్లు ఎటుపోయారు
ఎన్నికల ప్రచారంలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని మాయ మాటలు చెప్పి వాగ్దానాలతో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ ఎటుపోయారోనని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చుతామని ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ నిజం కాదా అని నిలదీశారు. ట్రిపుల్ బాధిత రైతులు ఎమ్మెల్యే కుంభం వద్దకు పోతే కనీసం సమయం ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎంపీ దగ్గరికి పోతే నాకేం తెల్వదు.. అంతా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే తెలుసు అంటూ మాట దాటేస్తున్నారని విమర్శించారు. దక్షిణ భాగం ట్రిపుల్ఆర్ అలైన్మెంట్లో మర్చినప్పుడు.. ఉత్తర భాగంలో రాయగిరి వద్ద అలైన్మెంట్ మార్చించాలనే ఆలోచన ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు ఎందుకు వస్తలేదని ప్రశ్నించారు. అలైన్మెంట్ మార్చే వరకూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీని అడ్డుకుంటామన్నారు. రాయగిరి ప్రజలు, రైతులు అండర్‌పాస్, బైపాస్, విద్యుత్ లైన్ ఏర్పాటుతో ఎంతో నష్టపోయారని, ట్రిబుల్ఆర్తో మరింత దెబ్బతింటారని ఆవేదన వ్యక్తం చేశారు.
-పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
అలైన్మెంట్ మార్చకుంటే ఆందోళనలు ఉధృతం
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చకుంటే ధర్నాలు, ఆందోళనలు ఉధృతం అవుతామని బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ హెచ్చరించారు. ట్రిబుల్ఆర్ బాధిత రైతులకు న్యాయం చేయాలని ధర్నా చేయడం, అధికారులకు విన్నవించడం తప్పా అని ప్రశ్నించారు. బారికేడ్లు, పోలీసులతో రైతులను అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
– క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి