మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొన్నది. ఆలయాల్లో భక్తులు శివ లింగాలకు అభిషేకాలు, పూజలు చేశారు. ఉపవాసాలు, జాగరణతో గడిపారు. భక్తిపాటలతోపాటు హర హర మహా దేవ.. శంభో శంకర, ఓం నమఃశివాయ నామస్మరణలు మార్మోగాయి.
జిల్లాలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరాలయం, పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలు, మేళ్లచెర్వు శంభు లింగేశ్వరస్వామి, వాడపల్లి అగస్తేశ్వర స్వామి, పిల్లలమర్రి ఎరుకేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడాయి.
ఈ సందర్భంగా కొన్ని చోట్ల పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. పలు చోట్ల జరిగిన వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.