కట్టంగూర్, సెప్టెంబర్ 25 : అగి ఉన్న కారును లారీ ఢీకొట్టడంతో బాలిక మృతి చెందింది. ఈ సంఘటన గురువారం కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని చీమలగడ్డకు చెందిన కందుల రుతు ఝాన్సీ తన కుమార్తె లవీనతో పాటు మనుమరాళ్లు రెముడాల అద్వితీ రియా, ఎండీ.అరీనతో కలిసి కారులో హైదరాబాద్లోని కుమారుడి వద్దకు బయల్దేరారు. మార్గమద్యంలోని ముత్యాలమ్మగూడెం శివారులోని గచ్చుగూరి చెరువు వద్దకు రాగానే కారు టైరు పంచర్ అయ్యింది. డ్రైవర్ ఏర్పుల సామేలు కారును రహదారి పక్కన నిలిపి టైర్ మార్చుతున్న క్రమంలో రుతు ఝాన్సీ, లవీన, ఎండీ.అరీన కిందికి దిగి పక్కకు నిలబడ్డారు.
అద్వితీ రియా (14) మాత్రం కారు ముందు నిలుచుంది. అదే సమయంలో కోదాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంక్ లారీ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో కారు ముందు నిలుచున్న అద్వితీ రియాకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి తాత లాజరస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
Kattangur : ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ.. బాలిక మృతి