శాలిగౌరారం, మే 29: లారీలో లోడ్ చేసిన ధాన్యం దిగుమతి కాకపోవడంతో డ్రైవర్లు అల్లాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఒకటి రెండు రోజులు కాదు.. 15 రోజులుగా ధాన్యం లోడ్‌తో ఉండటంతో లారీల టైర్లు పాడైపోతున్నాయని డ్రైవర్లు గోడు వెల్లబోసుకుంటున్నారు. మం డలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల నుంచి రైతుల ధాన్యాన్ని ఎగుమతి చేసుకొని శాలిగౌరారంలోని మార్కెట్ యార్డులో గల గోదాములో అన్లోడ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇంత వరకు భాగానే ఉన్నా… ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.
హమాలీల కొరత కారణంగా 15 రోజులుగా ధాన్యం బస్తాలు దిగుమతికి నోచుకోవడం లేదు. దీంతో గోదాము వద్ద పడిగాపులు కాస్తున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో సుమారు 15 లారీల వరకు దిగుమతి కోసం వేచి ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. మార్కెట్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.
10 రోజులు బండి ఆగిపోతే రూ.45 వేల నష్టం వస్తుందని, ఈఎంఐలు కట్టలేక చస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి ఫైనాన్స్ వాళ్లు వస్తే బతిమిలాడుకొని పంపిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తాసీల్దార్ మాధవరావును వివరణ కోరగా మార్కెట్లో హమాలీ కొరత ఉన్న మాట వాస్తమన్నారు. మరో రెండ్రోజుల్లో బీహార్ నుంచి హమాలీలను రప్పించి ధాన్యం దిగుమతి పూర్తి చేస్తామని తెలిపారు.
శాలిగౌరారం, మే 29: ధాన్యం బస్తాలను తక్షణమే అన్లోడ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద లారీ డ్రైవర్లు ధర్నా చేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా సుమారు అరగంట పాటు లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టి ధర్నా చేపట్టారు. మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు గడుస్తున్నా దిగుమతి చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రోడ్డుపై ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న తాసీల్దార్ మాధవరావు, ఎస్ఐ సైదులు అక్కడకు చేరకొని డ్రైవర్లతో మాట్లాడారు. రెండు రోజుల్లో దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు.
మాది నార్కెట్పెల్లి మండ లం. ధాన్యం దిగుమతి కో సం ఇక్కడికి వచ్చి 12 రోజులైంది. ఇప్పటి వరకు ధా న్యం బస్తాలు దిగుమతి కాలేదు. 10 రోజులు లారీ ఆగితే రూ.45 వేల నష్టం వస్తుంది. బండికి ఈఎంఐ రూ.లక్ష చెల్లించాలి. ఎక్కడి నుంచి తెచ్చి చెల్లించాలి. దిగమతి కాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. అప్పులు తెచ్చి ఈఎంఐలు కడుతున్నాం. ఒక్క లారీ లోడ్ 42 టన్నులు ఉండటంతో టైర్లు పగిలిపోతున్నాయి. మా బాధులు అర్థం చేసుకునే నాథుడే లేడు.
– మల్లయ్య, నార్కెట్‌పల్లి లారీ డ్రైవర్
శాలిగౌరారం మార్కెట్ యా ర్డులో కనీస సౌకర్యాలు లే వు. తాగడానికి మంచినీరు లేదు. మాసిన బట్టలతోనే గడుపుతున్నాం. నేను వచ్చి 9 రోజులైనా ధాన్యం అన్లోడ్ చేయడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే రేపు మాపు అంటూ రోజులు దాటేస్తున్నారు.
– హుస్సేన్, బైరవునిబండ లారీ డ్రైవర్